సిరిసిల్లలో అపారెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్  గ్రూప్ ముందుకు వచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారకరామారావు సమక్షంలో  అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం అపారల్ పార్కును ఏర్పాటు చేస్తోంది.  ఈ పార్క్‌లో పరిశ్రమకు సంబంధించిన పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మొత్తం 63 ఎకరాల సువిశాల పార్క్‌ను సుమారు రూ. 175 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నది.  అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. వస్త్రాల ఉత్పత్తితోపాటు ఎగుమతులకు అనుగుణంగా బిల్ట్ టు సూట్ పద్ధతిన దేశంలోనే తొలిసారిగా ఈ పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నది. 



బెంగళూరుకు చెందిన టెక్స్‌పోర్ట్  కంపెనీ 1978 నుంచి అపారల్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. విదేశీ ఎగుమతులే ప్రధానంగా రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నది.  సంవత్సరానికి 17 మిలియన్లకు పైగా గార్మెంట్స్‌ను కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటికే కంపెనీకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతాలలో రెడీమేడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కంపెనీ సుమారు రూ. 620 కోట్ల వార్షిక ఆదాయంతో దేశవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది.  తెలంగాణ ప్రభుత్వ నిర్మాణం చేస్తున్న సిరిసిల్ల అపారల్ పార్కులో 7.42 ఎకరాల స్థలంలో టెక్స్‌పోర్ట్ కంపెనీ తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా సుమారు 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. సుమారు 60 కోట్ల రూపాయలతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనున్నది.


రిసిల్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న అపారల్ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీకి మంత్రి కేటీఆర్ స్వాగతం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్‌టైల్ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి, వృత్తి నైపుణ్యం పెంపుదలకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కే తారకరామారావు ఈ సందర్భంగా తెలిపారు. టెక్స్‌పోర్ట్ కంపెనీ పెట్టే పెట్టుబడి వల్ల 2 వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. కంపెనీ సాధ్యమైనంత త్వరగా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.  
సిరిసిల్లలోని నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అక్కడే ఈ ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని టెక్స్‌పోర్ట్ కంపెనీ ఎండి గోయెంకా ప్రకటించారు.