ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకుంటున్న కేటుగాళ్లు వారిని ముంచి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మాయమాటలనే గ్యాలం వేసి తమ ఉచ్చులోకి లాగేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అధిక వడ్డీల ఆశ చూపి భారీగా వసూళ్లకు పాల్పడిన జయంత్‌ బిశ్వాస్‌ అనే 49 ఏళ్ల వ్యక్తిని సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి భార్య మోసిమి బిశ్వాస్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితులకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను గుర్తించిన పోలీసులు వాటిలోని రూ.8 కోట్ల నగదును ఫ్రీజ్‌ చేశారు. స్టార్టప్ కంపెనీకు పెట్టుబడులు వచ్చేందుకు సంస్థ ప్రారంభిస్తున్నామని, అందులో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని చెప్పడంతో చాలామంది వారివద్ద పెట్టుబడులు పెట్టారు. ఇలా ఒక్క తెలంగాణలోనే ఏకంగా రూ.70 కోట్ల వరకు వీరు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన జయంత్‌ బిశ్వాస్‌‌ డిప్లొమా అయ్యాక ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఇతనికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండేది. దీంతో రూ.లక్ష పెట్టుబడితో మెటలాయిడ్స్‌ సస్టెనెన్స్‌ పేరుతో రాజస్థాన్‌లో స్టార్టప్ ప్రారంభించాడు. పెట్టుబడి కోసం జయంత్ దంపతులు మరో కొత్త సంస్థ తెరిచారు. అసోం, అండమాన్‌, విశాఖ, కోల్‌కతా, జైపూర్‌, హైదరాబాద్‌ తదితర ప్రధాన పట్టణాల్లో సమావేశాలు పెట్టి.. ఏజెంట్ల ద్వారా ఖాతాదారులను ఆకట్టుకుని ఖరీదైన హోటళ్లు, రెస్టారెంట్లలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విందు వినోదాలకు ఆహ్వానించి.. సంస్థ పట్ల నమ్మకం ఏర్పడేలా చేశారు. కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెడితే, 10 నుంచి 100 శాతం వడ్డీలు ఇస్తామంటూ భారీగా డిపాజిట్లు సేకరించారు.


తెలంగాణలోనే 3,500 మంది బాధితులు
ఇలా తెలంగాణలోనే ఏకంగా 3,500 మంది నుంచి రూ.70 కోట్లు సేకరించారు. డిపాజిటర్లకు చెప్పినట్లుగానే కొంతకాలం ఆకట్టుకొనే వడ్డీలు చెల్లిస్తూ వచ్చారు. సంస్థలో పెట్టుబడులు పెట్టే డిపాజిటర్ల సంఖ్య పెరుగుతుండటంతో వారికి తిరిగి చెల్లించటం కష్టంగా అయింది. దీంతో బోర్డు తిప్పేసి పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్‌ స్టేషన్లకు క్యూ కట్టారు.


పోలీసులు కలిసి కట్టుగా టెక్నాలజీ ఉపయోగించి బంజారాహిల్స్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఉన్న జయంత్‌ బిశ్వాస్‌ను గత నెల 31న అరెస్ట్‌ చేశారు. తప్పించుకున్న అతడి భార్య కోసం వెతుకుతున్నారు. అయితే తాను ఏమీ తప్పు చేయలేదని జయంత్‌ బిశ్వాస్‌‌ వాదించడం పోలీసులకు విస్మయం కలిగించింది.  తన ఆలోచనను ప్రధానమంత్రి, ఆర్ధికమంత్రికి తెలియజేసి అనుమతులు కూడా తీసుకోవాలనుకుంటున్నట్లు విచారణలో వెల్లడించాడని పోలీసులకు చెప్పాడు. తన తెలివితేటలే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించానని, దాన్ని నేరమని ఎలా అంటారని ఎదురు ప్రశ్నించాడు.