పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమాపై మొదటి నుంచి ఏదొక కామెంట్ చేస్తూనే ఉన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని.. పవన్ క్రేజ్ అలాంటిది అంటూ కొన్ని పోస్ట్ లు పెట్టారు. రీసెంట్ గా సినిమా ట్రైలర్ రిలీజైనప్పుడు పవన్ కంటే రానా బాగా ఎలివేట్ అయ్యాడని.. రానాని హైలైట్ చేయడానికే పవన్ ని తీసుకున్నారంటూ ఎప్పటిలానే తన స్టైల్ లో పోస్ట్ లు పెట్టారు. ఈరోజు విడుదలైన సినిమాకి తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు. 


ఇప్పటికే హరీష్ శంకర్, మంచు మనోజ్ లాంటి సెలబ్రిటీలు ఈ సినిమాను ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు వర్మ కూడా సినిమాను పొగుడుతూ.. ట్వీట్లు వేశారు. భీమ్లానాయక్ ఒక థండర్ స్ట్రామ్ అని.. పవన్ కళ్యాణ్ సునామీ అని అన్నారు వర్మ. రానా ఈజ్ నెక్ టు నెక్.. ఓవరాల్ గా ఈ సినిమా ఒక భూకంపం అంటూ రాసుకొచ్చారు వర్మ. 


'నేను రిపీటెడ్ గా చెబుతూనే ఉన్నాను.. 'భీమ్లానాయక్' సినిమాను హిందీలో రిలీజ్ చేయమని.. అలా చేసి ఉంటే సినిమా పెద్ద సెన్సేషన్ అయ్యేది' అంటూ చెప్పుకొచ్చారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది.


మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలానే మార్పులు చేశారు. హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాముఖ్యతనిచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా రానా కనిపించారు.