ప్రభుత్వం ముందస్తు చర్యలతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదు
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చెరువులు, కుంటలు చెక్ డ్యామ్ లన్ని సురక్షితం
అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దు
అన్ని శాఖల అధికారులు  క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ మీద ఉండాలి
రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి.
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
భారీ వర్షాలపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ గంగుల కమలాకర్ అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వరద నీటితో నిండిపోయినా.. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అధికారులతో సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్ అలర్ట్ కింద ఉందని, ప్రజలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.


ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు..
అల్పపీడన ప్రభావంతో ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయని, చెరువులు, జలాశయాలు నీటితో నిండు కుండల్లా మారినా ప్రభుత్వం అప్రమత్తత, అధికారుల పనితీరుతో ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదన్నారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ మీద ఉండి విధులు నిర్వహిస్తున్నారని, డ్రైనేజీలను పరిశీలిస్తున్నారని చెప్పారు. 


మున్సిపల్ అధికారుల ముందు చూపుతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డప్పటికి నగరంలో రోడ్ల మీద ఎక్కడా వర్షపు నీరు నిలువలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా  50వేల ఎకరాల్లో వరి వేశారని, కొన్ని ప్రాంతాల్లో పత్తి, పెసరు పంటల రైతులు నష్టపోయారని.. అధికారులు ఆ పంట నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి గంగుల సూచించారు. జిల్లాలో చెక్ డాములన్ని సురక్షితంగా ఉన్నాయని వెల్లడించారు. భారీ వర్షాల తర్వాత అంటూ వ్యాధులు ప్రబలకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి గంగులతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌తో పాటు నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read: IMD Rains Alert: ఈ 12 లేదా 13న మరో అల్పపీడనం ముప్పు - 7 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


బీ అలర్ట్..
వర్షాలు కురుస్తున్నాయని, తలదాచుకునేందకు పాత భవనాలలోకి వెళ్లకూడదని ప్రజలను హెచ్చరించారు. కరెంట్ పోల్స్, తుప్పు పట్టిన ఇనుప వస్తువులను పట్టుకోవడం లాంటివి చేయవద్దని వాతావరణ శాఖ అధికారులు సైతం రాష్ట్ర ప్రజలకు సూచించారు. నిలిచిపోయిన నీటి ప్రవాహం దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని మంత్రి గంగుల అన్నారు. ఈదురు గాలులు అధికమైతే విద్యుత్ శాఖ అప్రమత్తమై కరెంట్ సరఫరా విషయంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీరు ప్రవహిస్తున్న చోట దాటే ప్రయత్నం చేయవద్దని కాలినడకన వెళ్తున్న వారికి సైతం సూచనలు చేశారు.


భద్రాచలం వద్ద 50 అడుగులు దాటిన నీటి మట్టం..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి పలు ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.4 అడుగులకు చేరుకుంది. మరికొన్ని గంటల్లోనే 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా అధికారులు మూడో (చివరి) ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ముఖ్యంగా నేటి ఉదయం నుంచి వరద ప్రవాహం పెరిగిపోతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 12,79,307 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో గోదావరి నదిలో అక్కడి స్నానఘట్టాలు మునిగిపోయాయి. దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Also Read: MMTS Services Cancelled: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - 3 రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు