బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా బండి సంజయ్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పార్టీ జాతీయ నేతలతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బండి సంజయ్ కు ఫోన్, ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీకి చెందిన కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా హైదరాబాద్‌లో పేదలకు, దుప్పట్లు పంపిణీ చేశారు.
కరీంనగర్‌లో మౌన దీక్ష
తెలంగాణలో పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, ఇతర వైఫల్యాలకు నిరసనగా బండి సంజయ్ కరీంనగర్‌లో సోమవారం రెండు గంటల మౌన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ మౌన దీక్ష సాగింది. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. అవినీతి గురించి కేసీఆర్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఏ పథకం తెచ్చినా కేసీఆర్ కుటుంబం బాగు కోసమేనని విమర్శించారు. ధరణిలో కబ్జా అనే కాలం ఎందుకు తీసేశారని నిలదీశారు. అసలు ధరణి వల్ల ఎవరికి లాభం కలుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. పోడు భూముల పేరుతో అడవి బిడ్డలను కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. గిరిజనుల మీద లాఠీ ఛార్జ్ చేస్తారా? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరణి అనే దరిద్రపుగొట్టు పోర్టల్ తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఏ సమస్య వచ్చిన కూడా కూర్చీ వేసుకొని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారన్నారు. ఎనిమిదేళ్ల నుంచి ఇదే చెబుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారన్నారు. ఇంత వరకు ఏ సమస్యను కూడా పరిష్కరించలేదని ఆరోపించారు.
పల్లెల్లో ధరణి చిచ్చు
నోరు తెరిస్తే కేసీఆర్ అబద్దాలే చెబుతున్నారని విమర్శించారు బండి సంజయ్. ఆదివారం కూడా ప్రెస్‌మీట్ పెట్టి పచ్చి అబద్దాలే మాట్లాడారన్నారు బండి. ధరణి గొప్పగా ఉందని తనకు తానే కితాబు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి తగ్గించడానికి ధరణీ తీసుకొచ్చామని చెబుతున్న కేసిఆర్.... అవినీతి గురించి మాట్లాడితే... దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.