Rains in AP Telangana: ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాలను మేఘాలు కమ్మేశాయి. ఈ నెల 12న లేదా 13వ తేదీన ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్ప పీడనం కారణంగా ఏపీలోని కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.


తెలంగాణలో ప్రాజెక్టులకు వరద నీరు.. 
మరికొన్ని గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. జూలై 12న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని తీర ప్రాంతాలు, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేగంగా గాలులు వీస్తాయి. అదే సమయంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద నీటితో ఎస్సారెస్సీ రెండు రోజుల్లో నిండనుంది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన బ్యారేజీల గేట్లు ఎత్తడంతో సమ్మక్క బ్యారేజీ వద్దతొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది.


తెలంగాణలో వర్షపాతం వివరాలు..
ఏరియా      -      వర్షపాతం
ఆదిలాబాద్  - 19.4 మీ.మీ
భద్రాచలం  - 76.2 మీ.మీ
హకీంపేట్  - 25.4 మీ.మీ
దుండిగల్  - 26 మీ.మీ
హన్మకొండ  - 46.8 మీ.మీ
హైదరాబాద్ - 16.2 మీ.మీ
ఖమ్మం  - 11.8 మీ.మీ
మహబూబ్ నగర్  -0.8 మీ.మీ
మెదక్  - 18.4 మీ.మీ
నల్గొండ  - 7.4 మీ.మీ
నిజామాబాద్ - 23 మీ.మీ
రామగుండం - 65.2 మీ.మీ






ఏపీలో వాతావరణం ఇలా.. 
ఒడిశా పరిసర ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్పపీడనంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మణ్యం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు , చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Also Read: Rains in AP Telangana: దంచికొడుతున్న వర్షాలు - తెలంగాణలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలోనూ ఆ జిల్లాల్లో కుండపోత: IMD


నాగావళి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అక్కడి నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 4,135 క్యూసెక్కులు చేరుతోంది. అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీరు అధికం కావడంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 4,900 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 30.1 మీటర్లకు చేరడంతో మొత్తం 48 రేడియల్‌ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నేటి మధ్యాహ్నానికి పోలవరం ప్రాజెక్టుకు 10–12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అంచనా వేసిన అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు.