ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రిల్లో నిర్వహిస్తున్న తనిఖీలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. చూసే వాళ్లకు ఏదో జరగబోతుంది అన్నట్టుగా కనిపిస్తున్నా.. ఇదేదో రొటీన్ వ్యవహారం లాగే తీసుకుంటున్నాయి ప్రైవేటు ఆసుపత్రి యజమాన్యాలు. నిబంధనలు అన్నింటిని తుంగలో తొక్కి పేషెంట్ల నుంచి అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నా.. ప్రైవేట్ ఆసుపత్రులు ఏమాత్రం తనిఖీలకు బెదరడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారులు తనిఖీలు చేసి మళ్లీ అటువైపు కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




పేరు గొప్ప ఊరు దిబ్బ


ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 293 ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో దాదాపు 87 హాస్పిటల్స్ కి నోటీసులు సైతం అందించారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఇవి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా మొదలు పెట్టడమే గమనార్హం. అంతే కాదు పూర్తి స్థాయిలో మార్కెటింగ్ పైనే ఆధారపడి పేషంట్లను జలగల్లా పట్టిపీడిస్తున్నాయి. దాదాపుగా 350కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు జిల్లాలో ఉండగా... పూర్తి స్థాయి తనిఖీలకు మరో మూడు రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 100 ఆసుపత్రుల్లో కనీసం 30 ఆసుపత్రులకు అసలు రూల్స్ అనేవి ఏంటో తెలీదు. మరో వైపు బరితెగించి వీరు చేస్తున్న వైద్యాన్ని చూసి ఉన్నతాధికారులు సైతం నివ్వెరపోయారట. అసలు డాక్టర్లే లేని ఆసుపత్రులు బోలెడు ఉన్నాయి. తమ వద్ద ప్రతి స్పెషలిస్ట్ ఉన్నారంటూ బోర్డులు తగిలించుకొని కేవలం ఒకరిద్దరు డాక్టర్లతో కథ నడిపిస్తున్నారు. ఇందులో సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్న వారు కొందరు కాగా.. మరికొందరు పెట్టుబడి పెట్టి వైద్యాన్ని పూర్తిగా వ్యాపార వస్తువుగా మార్చి వేశారు.


చాలామందికి అనుమతులు లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇంకొన్ని గడువు దాటినా రెన్యువల్ మాత్రం చేయించుకోలేదు. ఇక భారీ ఎత్తున పేషెంట్లను చేర్చుకుంటూ ఉన్నా మూడు పెద్ద ఆసుపత్రులకు కనీసం గుర్తింపు కూడా లేదు. ఇక లైసెన్సు రద్దు అయినా ఆసుపత్రి యజమాన్యం  అదే చోట ఏ మాత్రం భయం లేకుండా ఆస్పత్రిని నడిపిస్తూనే ఉంది.


ఫైర్ సేఫ్టీ ఊసే లేదు?


చాలా వరకు హాస్పిటల్స్ ఇరుకైన భవనాల్లో నిర్మాణమై ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం లాంటిది జరిగితే తప్పించుకునే పరిస్థితి లేదు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాలు జరిగి పేషంట్ల ప్రాణాలు సైతం పోయిన పరిస్థితి. అయినా ఇక్కడి వైద్యాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఇక ఆలోపతితో పాటు డెంటల్, హోమియో, ఆయుర్వేద ఆసుపత్రిలో సైతం ఇదే రకమైన పరిస్థితి నెలకొని ఉండటాన్ని అధికారులు గుర్తించారు. గతంలో తప్పుడు సర్టిఫికెట్లతో పేషంట్లకు నెలల తరబడి వైద్యం చేసిన ఉదంతాలు సైతం జరిగాయి. చివరకు మీడియా వరుస కథనాలతో సదరు నకిలీ వైద్యులు ప్రాక్టీస్ మానుకున్నారు. నిజానికి ఈ తనిఖీలు రెగ్యులర్ గా జరుగుతూ ఉండాలని సామాన్యులు కోరుతున్నారు. దీనివల్ల కొత్తగా వైద్య వృత్తిలోకి వచ్చే వారు ఎవరో తెలిసిపోతుంది నకిలీ వైద్యుల్లో సైతం అంత ఇంతో భయం ఉంటుందని అంటున్నారు.


జలగల్లా రక్తాన్ని పీలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రలు


గతంతో పోలిస్తే ఈసారి భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించినప్పటికీ తీసుకునే చర్యలపైనే అధికారులపై ప్రజలకు నమ్మకం కుదురుతుంది. కరోనా సమయంలోనూ రోగాన్ని బూచిగా చూపి అనేక ఆసుపత్రులు చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. పవిత్రమైన వైద్య వృత్తిని కాపాడాలంటే స్వీయ నియంత్రణ మేలు అని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైద్యులు భగవంతుడితో సమానం అనే నానుడిని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఎప్పుడో మర్చిపోయాయి. పేషెంట్ నడిచొచ్చే డబ్బుల యంత్రంలా వారికి కనిపించడమే దీనికంతటికీ కారణం.