Karimnagar Kalotsavam :తొలిసారిగా నిర్వహిస్తున్న కళోత్సవాలకు కరీంనగర్ ముస్తాబయింది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు నగరంలోని అంబేడ్కర్ స్టేడియం సిద్ధమైంది. సన్నాహక వేడుకల్లో భాగంగా గురువారం నిర్వహించిన క్యాంప్ ఫైర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కళాకారులు పాల్గొని కొత్త ఉత్సాహాన్ని నింపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రదర్శనలను నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, గొప్పతనాన్ని చాటేలా ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. 



20 రాష్ట్రాల కళాకారులు 


రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల తీరుపై ఆరా తీశారు. వేరువేరు ప్రాంతాల నుంచి వస్తున్న కళాకారులకు సౌకర్యాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. మొత్తం 10 గేట్ల ద్వారా వీక్షకులను అనుమతిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కళోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు వేదికపై జ్యోతి వెలిగించిన తరువాత కళాప్రదర్శనలు మొదలవుతాయి.  ఇప్పటి వరకు 20 రాష్ట్రాలకు చెందిన కళాకారులు కరీంనగర్ కు చేరుకోగా ఇజ్రాయిల్, మలేషియాకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేందుకు కరీంనగర్ చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం నేటి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ రావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల మంత్రి రాకపోవడంతో స్పీకర్ సంబరాలను ప్రారంభిస్తున్నారు. 



ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ 


అక్టోబర్ 2న ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ వస్తారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవికి సైతం ఆహ్వానం అందినప్పటికీ ప్రస్తుతం షూటింగ్ కారణాలవల్ల మెగాస్టార్ రాలేకపోతున్నట్లు సమాచారం. ఇక నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. ముందస్తుగా గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకల్లో మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్,అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సందడి చేశారు. నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. నృత్యాలు చేస్తూ ఆయా రాష్ట్రాల నుంచి గురువారం రాత్రి కళాకారులు అంబేడ్కర్ స్టేడియానికి తరలిరాగా మంత్రి గంగుల కమలాకర్ పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన క్యాంప్ ఫైర్ వద్ద ఇజ్రాయిల్ తో సహా పలు రాష్ట్రాల కళాకారులు పాటలతో అలరించారు. కళోత్సవాల సందర్భంగా కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చిన వారికి ఒకవేళ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైనా ట్రీట్మెంట్ అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో పార్కింగ్ తో సహా భద్రత ఏర్పాట్లను సైతం కట్టుదిట్టంగా చేశారు.