కరీంనగర్ పట్టణ ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నగర ప్రజల భద్రతే లక్ష్యంగా 94.99 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ నేరుగా ఎల్ఎండీ లేక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని... అక్కడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ ను పరిశీలించారు. ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని... ట్రాక్ ను ఆనుకుని ఇరువైపుల పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలు పెరిగి వృక్షాలుగా మారితే... అహ్లాదకరమైన వాతావరణంతో పాటు.. వాకింగ్ చేసే వారికి అటవీ ప్రాంతంలో వాకింగ్ చేసినట్టు అనుభూతి కలుగుతుందని అన్నారు.
అనంతరం కరీంనగర్ సిటీ రెనోవేషన్ (KCR) లో భాగంగా నగరంలో 94.99 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ పనులకు స్థానిక తెలంగాణ చౌక్ లో బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం కోసం మానేరు జలాశయం దిగువన నుతన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
నగర ప్రజలు మానేరు డ్యామ్ మీద నడవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని తమ దృష్టికి తేవడంతో జలాశయం కింద కోటి రూపాయలతో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కామాండ్ కంట్రోల్ మున్సిపల్ పై అంతస్థులో ఉంటుందని, నగరం మొత్తం ఇంచు ఇంచు కనిపించేలా ఈ కమాండ్ కంట్రోల్ పని చేస్తుందని దీని కోసం నగరంలో 335 HD కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కమాండ్ కంట్రోల్ లో..
85 ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టమ్స్
85 రెడ్ లైట్ వయోలేషన్ కెమెరాలు
ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రెకగ్నిషన్ 174 కెమెరాలు
85 వెహికల్ డిటెక్షన్ కెమెరాలు
10 డిస్‌ప్లేలు
40 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్
10 ఎన్విరాన్మెంట్ సెన్సార్లు
150 వైఫై హాట్ స్పాట్లు
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు
ట్రాఫిక్ ను బట్టి సిగ్నల్ పని చేసేలా ఆటోమేటిక్ ట్రాఫిక్ సిస్టమ్స్ పని చేస్తుందని మంత్రి అన్నారు. ప్రతి వాహన దారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా.. రెడ్ లైట్ పడ్డా ఆగకుండా వెళితే నెంబర్ ప్లేట్ క్యాచ్ అయి ఆర్టీవో ఆఫీస్ కు వివరాలు వెళ్లేలా రెడ్ లైట్ వయోలేషన్, వెహికిల్ డిటెక్షన్.. కెమెరాలు పని చేస్తాయని అన్నారు. సిగ్నళ్ల వద్ద డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందులో ట్రాఫిక్ నిబంధనలతో పాటు, ప్రభుత్వ కార్యక్రమలు, వినిపించేలా 40 చోట్ల ఏర్పాటు చేశామని అన్నారు.
దేశంలో ఏ పట్టణాల్లో లేని 10 ఎన్విరాన్మెంట్ సెన్సర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సెన్సార్లు నగరంలోని తేమ, కాలుష్యం వంటి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు. నగర వాసుల సౌలభ్యం కోసం మొదట 15 చోట్ల ఉచిత వైఫై ఏర్పాటు చేస్తున్నామని.. త్వరలోనే నగరమంతా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా నగరంలోని చెత్త బండ్లకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందని దీని ద్వారా ఆ వాహనం ఎక్కడికి వెళ్తుంది.. ఎక్కడ ఆగిపోయింది అని పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు.
కోటి రూపాయలతో 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని.. ట్రాక్ చుట్టూ చెట్ల మధ్య ప్రశాంతంగా ఉండేలా 20 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉజ్వల పార్కు వద్ద కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.