Karimnagar News: కరీంనగర్ లో సంచలనం సృష్టించిన నకిలీ సదరం సర్టిఫికెట్ లో భారీ కుంభకోణంపై పూర్తి స్థాయిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పట్టు బిగిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 726 నకిలీ సదరం సర్టిఫికెట్లు అధికారికంగా బయటకు వచ్చినట్టుగా గుర్తించిన ఏసీబీ అసలు ఆయా వ్యక్తులకు వైకల్యం ఎంత ఉంది అనే విషయంపై కూడా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏసీబీ రాష్ట్ర స్థాయి అధికారులకు గతంలో అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ ఆధారంగా కరీంనగర్ లో గల ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 


2017 డిసెంబర్ నుండి 2021 డిసెంబర్ వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లపై ఈ దర్యాప్తు బృందం ముఖ్యంగా దృష్టి సారించారు. దీంతో ఈ నాలుగేళ్లలో మొత్తం 3,216 సర్టిఫికెట్లు ఇవ్వగా ఇందులో ఉన్న అనుమానిత సర్టిఫికెట్లను గుర్తించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఎంత డబ్బు కలెక్ట్ చేశారు? అలాగే తీసుకున్న వారు ఏ ప్రభుత్వ పథకాలకు వీటిని వాడారనే దానిపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు ఇకపై నివేదిక పూర్తయిన వెంటనే రాష్ట్ర స్థాయి అధికారులకు సమర్పించి వారి పైన చట్టపరంగా చర్యలు చేపట్టే దిశగా వెళ్తున్నట్లు సమాచారం.


అసలేం జరిగింది?
గతంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కేంద్రంగా కొందరు కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను పెట్టుకొని మరీ ఈ దందాకి తెరలేపారు. సదరం సర్టిఫికెట్ అనేక పథకాలకు ముఖ్యమైనది కావడంతో దాదాపు 50 వేల నుండి రెండు లక్షల వరకు డబ్బులు నకిలీ లబ్ధిదారుల నుండి వసూలు చేసి పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఉన్న వ్యక్తులకు సైతం ఇచ్చినట్టుగా వార్తా కథనాలు వరుసగా వెలువడ్డాయి. అయితే, ఇందులో కేవలం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను మాత్రమే బలి పశువులు చేసి అసలైన నిందితులు తప్పించుకొనే ప్రయత్నం చేశారు. 


దీంతో ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర స్థాయి అధికారులకు అప్పటివరకు జరిగిన విషయాలన్నిటిని పూసగుచ్చినట్టు వెల్లడిస్తూ లేఖ రాశారు. ఇంత భారీ కుంభకోణం జరిగినా స్థానికంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇక రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. 100 శాతం ఆరోగ్యంగా ఉండి ఎలాంటి వైకల్యం లేని వ్యక్తులు సర్టిఫికెట్లు డబ్బులు పెట్టి మరీ కొనుగోలు చేయడం.. ఇదంతా బయటపడి పెను సంచలనం కావడంతో చర్యలకు సిద్ధం అవక తప్పలేదు. అనేకమంది నిజమైన అర్హులు అనేక ప్రభుత్వ పథకాలను పొందడానికి దూరమయ్యారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో చర్యలు చేపట్టి కుమ్మక్కయిన వైద్య సిబ్బందిని, సహకరించిన ప్రైవేట్ వ్యక్తులపై సైతం కేసులు నమోదు చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.