Karimnagar News: మనిషి అంత్యక్రియల అనంతరం పోయినవారి అస్తికలను పవిత్ర తీర్థాల్లో కలపడం హైందవ ధర్మ సంప్రదాయం. కానీ, ఆ విశ్వాసాన్నే దెబ్బతీసేలా.. అక్కడి దొంగతనాలు విస్తు గొల్పుతున్నాయి. శవాల మీద చిల్లరేరుకునేవారి చూశామేమోగానీ.. శవాల ఎముకలను దొంగతనం చేస్తున్న దొంగలను మీరెప్పుడైనా చూశారా? ఇంతకీ ఎముకల దొంగతనాలెందుకు జరుగుతున్నాయి? క్షుద్రపూజల కోసమా.. బంగారం కోసమా? ఇదే సమయంలో గత పదిహేను రోజులుగా అక్కడ వరుస మరణాలు కూడా సంభవిస్తుండటంతో.. పెద్దపెల్లి జిల్లా  శ్మశానదొంగల కథ.. ఇప్పుడక్కడి ప్రజల సెంటిమెంట్ పై దెబ్బ కొడుతోంది.


శ్మశానాల్లోనూ దొంగతనాలు జరుగుతుండం ఇప్పుడు పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నెల 17వ తేదీన ఇదిగో ఈ ఇద్దరు మహిళలు ఓ శవం దహన సంస్కారాలు అలా పూర్తయ్యాయో లేదో... శ్మశానంలోకి ఎంట్రీ ఇచ్చారు. పూర్తిగా ఇంకా శవం కాలకముందే.. పుర్రె భాగంలో బూడిదను అటూ, ఇటూ కదుపుతూ కనిపించారు. అనుమానం వచ్చిన బంధువులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు తహసీల్దార్ వద్ద వారిని బైండోవర్ చేసి.. కేసు నమోదు చేశారు. ఈ మహిళలిద్దరిదీ మంచిర్యాలగా పోలీసులు గుర్తించారు. ఎందుకు వీరి దొంగతనం చేస్తున్నారని పోలీసులడిగితే.. చనిపోయాక ఉన్నవాళ్లు వాళ్ల నోట్లో వారి స్థోమతను బట్టి బంగారాన్ని నోట్లో వేసి దహనం చేస్తారు కాబట్టి.. ఆ బంగారమేమైనా దొరుకుతుందేమోనని దొంగతనానికి వచ్చామన్నది మహిళల వాదన. అయితే, వచ్చిన దొంగలు బంగారం కోసం వచ్చినవారేనా.. లేక, తాంత్రిక పూజల తంతు కోసం ఎముకలు తీసుకెళ్తున్నారా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. ముఖ్యంగా వచ్చిన దొంగలు ఎముకలన్నింటినీ తమ సంచుల్లో నింపుకుని వెళ్తుండటం అనుమానాలను బలపర్చింది. పైగా పోలీస్ స్టేషన్ లో విచారణలో ఉన్నవారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మళ్లీ ఛాయ్ తాగి వస్తామని చెప్పి బయటకొచ్చి.. తిరిగి శ్మశానానికే రావడంతో అసలేం జరుగుతోందన్న ఆందోళన సుల్తానాబాద్ లో నెలకొంది.


హైందవ ధర్మంలో చనిపోయినవారి అస్తికలను గంగ, గోదావరి వంటి పుణ్యనదుల్లో కలిపే ఆనవాయితీ ఉంటుంది. ఆ విశ్వాసాలను కాలరాస్తూ సుల్తానాబాద్ శ్మశానంలో అలా దహనమై కుటుంబీకులు ఇంటిబాట పడుతున్నారో, లేదో.. బొక్కలు, ఎముకలు మాయమైపోతున్నాయి. మరోవైపు సుల్తానాబాద్ శివార్లలో కెనాల్ వద్ద ఈ మధ్య క్షుద్రపూజల కలకలం రేపడంతో పాటు.. ఇదే ప్రాంతంలోని కాల్వశ్రీరాంపూర్ లోనూ తరచూ ఇలాంటి తాంత్రిక పూజలు కలవరపెడుతున్నాయి. ఇంకొకవైపు సుల్తానాబాద్ లో ఇటు శ్మశానంలో దొంగతనాలు జరుగుతున్న సమయంలోనే యాదృచ్ఛికమో ఏమోగానీ.. వరుసగా పదిహేను రోజుల్లో సుమారు పదిమందికి పైగా చనిపోవడం కూడా ఆందోళన, అనుమానాలను రేకెత్తిస్తోంది. ఏదైనా పీడ.. అరిష్ఠం ఊరికి పట్టిందా అనే భావనలో ఉన్నట్టు స్థానికులే చెబుతున్నారు. అయితే, పోలీసులు మాత్రం కేవలం బంగారం కోసమే దొంగతనాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.


మూఢ నమ్మకాలను కొట్టిపారేస్తూ ఇప్పటికే పోలీసులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా.. శ్మశానాల్లో దొంగతనాలు బంగారం కోసమేనని చెబుతున్నా.. అంతకుమించి తాంత్రికపూజల కోసమేనేమోనన్న బలమైన అనుమానాలు మాత్రం స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.