Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు, వ్యాపారులు డైలమాలో పడిపోయారు. గతంతో పోలిస్తే ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో అమ్మకం కొనుగోళ్ల విషయంలో తికమక పడుతున్నారు. తెల్ల బంగారం ధర ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మకుండా ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. దీంతో పత్తి లేక జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది జనవరిలో క్వింటాల్ పత్తి కి రూ.12,000, ఫిబ్రవరిలో రూ.14,000 వరకు బహిరంగ మార్కెట్లో ధర పలికింది. ఈసారి కూడా అదే విధంగా రేటు వస్తుందన్న ఆశతో పత్తి దిగుబడులను విక్రయించడం లేదు. డబ్బులు అవసరం ఉన్నవారు కూడా కొంతే అమ్ముతున్నారు తప్ప.. పూర్తి స్థాయిలో అమ్మడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ జిన్నింగ్ మిల్లులను నిర్ణయించినప్పటికీ ఓపెన్ మార్కెట్ లోనే ఎక్కువ ధర పలకడంతో (సీసీఐ)కొనుగోలు ప్రారంభం కాలేదు.


జిల్లాలోని వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంత కుంట మండలాల్లోని ఆరు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లకు సిద్ధం చేసింది. జిల్లాలో ఈ సీజన్ లో 69 వేల 200 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. మొత్తం 4.84 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొదటి, రెండో దఫా ఏరిన పత్తి నాణ్యతగా ఉండడంతో బహిరంగ మార్కెట్ లో మంచి ధర రావడం రైతులకు కలిసొచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకొని చూస్తే ఇంకా పెరుగుతుందని రైతులు పత్తిని అమ్మడానికి ముందుకు రావడం లేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్వింటాలుకు రూ.6,380 నిర్ణయించింది. ఓపెన్ మార్కెట్లో మాత్రం రూ.8000 నుంచి రూ.9000 వరకు ధర పలుకుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ లో రూ.5000 నుంచి ప్రారంభమైన ధర రోజు రోజుకు పెరుగుతూ.. నవంబర్ లో రూ.9000 వరకు పలికింది. ప్రస్తుతం రూ.8000 ఉంది. 


జిల్లాలో ఈ సీజన్ లో 4.84 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 11,000 క్వింటాళ్లు మాత్రమే జిన్నింగ్ మిల్లులు నిర్వహణకులు, ప్రైవేటు వ్యాపారాలు కొనుగోలు చేశారు. అధిక వర్షాలతో వాతావరణం అంతగా అనుకూలించక జిల్లాలో పత్తి పంట దిగుబడులు రైతు ఆశించిన మేర రావడం లేదు. పత్తిలో ఎదుగుదల లోపించింది. ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.20 వేలకు పైగా పెట్టుబడులు  పెట్టినప్పటికీ ఎకరానికి 7 క్వింటాళ్లు కూడా రాకపోవడం కర్షకులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే రైతులు రెండు రకాలుగా పత్తిని సేకరించారు. కొంతమంది దళారులు గ్రామాల్లో కొన్ని మహారాష్ట్ర, ఆదిలాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో జిల్లాలోని జిన్నింగ్ మిల్లులు ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు కేంద్రాలు పత్తి విక్రయాలతో కళకళలాడగా, ప్రస్తుతం బోసి పోతున్నాయి. ఆశించిన మేర పత్తి రాక జిన్నింగ్ మిల్లులో కూలీల భారం మీద పడుతోందని జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు ఆందోళన పడుతున్నారు. ఏది ఏమైనా స్పష్టత వస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం లభించేలా లేదు.