Jeevan Reddy on BRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవడం పక్కా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్.. దేశాన్ని ఏం ఉద్దరిస్తారన్నారని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలన్నారు. ఈడీ విచారణ పూర్తవ్వగానే ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లిందని ఆరోపించారు. అసలు ప్రగతి భవన్ ఉన్నది ఇందుకేనా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతిని కలిసి తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మాట్లాడాలన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఈడీ దాడులు చేస్తుంటే, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోలీసులను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. 


"సీఎం కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలు కాపాడకోవడమే ఆయన మొదటి లక్ష్యం. తప్పు చేస్తే బిడ్డ, కొడుకు ఎవరని చూడనని చెప్పిండు. సలాకల ఎన్క నిలవెడ్తా అన్నడయ్యా. ఏమైందియ్యాల బిడ్డకు ఏదైన ఆరోపణ రాగానే సీబీఐ కాల్షీట్ లో ఇట్ల అడుగు వెట్టిందో లేదో దొరసాని ప్రగతి భవన్ లకు పరిగెత్తుతది. ప్రగతి భవన్ ఉన్నది ఎందుకయ్యా గిందుకేనా. నువ్వు చెప్పిందేంది.. ఇయాలా జరుగుతున్నదేంది. నువ్వు టీఆర్ఎస్ పెడ్తవా, బీఆర్ఎస్ పెడ్తవా నీ ఇష్టం. బీఆర్ఎస్ యే కాదు వీఆర్ఎస్ కూడా ఉంది. వాలంటరీ రిటైర్ మెంట్ స్కీం. బీఆర్ఎస్ తర్వాత కేసీఆర్ కు వీఆర్ఎస్ యే. నువ్వు పెట్టుకో. బీఆర్ఎస్, వీఆర్ఎస్ నీ ఇష్టం. నువ్వు ఉన్నన్ని రోజులు, ఆరు నెల్లు ఉంటవో, ఎనిమిది నెల్లు ఉంటవో.. ఇంకెంత కాలం ఉంటవో మాకు తెల్వదు గానీ.. ఉన్నన్ని రోజులు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ఉద్యమ నాయకుడిగా.. రాజకీయ పక్షాలనన్నిటినీ ఏకం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడు" అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.


హైదరాబాద్ లోని మాదాపూర్‌లో ఉన్న కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ కార్యాలయం పై పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని సోదా చేయాలన్నా సెర్చ్ వారెంట్ అవసరమని.. కానీ పోలీసులు అవేవీ లేకుండానే కాంగ్రెస్ వార్ రూంలో తనిఖీలు చేయడం దారుణం అన్నారు. మేం ధర్నా చేస్తామంటే కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 






అంతకుముందు ఆయన గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.  సమర్పించుకున్నారు.