Karimnagar News: కరీంనగర్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత.. మాజీ మేయర్ రవీందర్ సింగ్ కి కాలం కలిసి వచ్చినట్టే కనిపిస్తోంది. ఒకానొక సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారేమో! ఉన్నంతగా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆకస్మికంగా పార్టీలో జరిగిన పరిణామాలు సర్దార్ జీకి మళ్లీ కొత్త అవకాశాలను ఇస్తున్నాయి. తన కూతురి పెళ్లికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం కేసీఆర్ ఏకంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెట్టడం సింగ్ వర్గంలో సంతోషాన్ని నింపింది. రవీందర్ సింగ్ పొలిటికల్ కెరీర్ గ్రాఫ్ లో అప్ అండ్ డౌన్స్ పై స్పెషల్ స్టోరీ..!


ఇదీ సర్దార్ జీ ప్రస్థానం...!


కరీంనగర్ పట్టణంలోని సిక్కువాడిలో జన్మించిన రవీందర్ సింగ్ విద్యాభ్యాసం స్థానికంగానే కొనసాగింది. 1987లో ఎల్.ఎల్.బి పూర్తి చేసి న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు. 2008లో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆయన  ఎన్నిక అయ్యారు. ఇక రాజకీయంగా మొదటి నుంచి రవీందర్ సింగ్ చాలా యాక్టివ్.. ఎస్.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఎలక్షన్స్ లో 1984 లోనే కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. 1995లో ఇండిపెండెంట్గా పోటీ చేసి కౌన్సిలర్ గా కరీంనగర్ పురపాలక సంఘంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 1999 నుంచి 2006 వరకు కరీంనగర్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ గా పని చేశారు.2 000 సంవత్సరంలో కరీంనగర్ కార్పొరేషన్ కి కౌన్సిలర్ గా 2005లో బీజేపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్ గా ఎంపికయ్యారు. ఇక ఉద్ధృతంగా ఉద్యమం మొదలైన సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు 2006లో బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 


2010లో కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ అధిష్టానం నియమించింది. 2006లో కరీంనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కు పట్టణంలో విస్తృతమైన ప్రచారం చేశారు. రవీందర్ సింగ్ 2010లో టీఆర్ఎస్ తరఫున మరోసారి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ 50కి పైగా కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా.. ఆర్టీసీ టీఎంయూ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడితో పాటు పలు ట్రేడ్ యూనియన్లకు గౌరవ సలహాదారుడిగా పని చేశారు. ఇక 2014లో కరీంనగర్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో గెలిచి మొట్ట మొదటిసారిగా మేయర్ గా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక సిక్ మేయర్ గా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర మేయర్లు, ఛైర్మన్ ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


మంత్రితో విభేదాలతో సైలెంట్..


స్థానికంగా మంత్రి గంగుల కమలాకర్ వర్గీయులతో అనేక అంశాల్లో భేదాభిప్రాయాలు నెలకొనడంతో కొద్దిరోజుల పాటు సైలెంట్ గా ఉన్నారు. రవీందర్ సింగ్ ఒకానొక సమయంలో బీజేపీలోకి తిరిగి వెళ్లిపోతారని ప్రచారం సైతం జరిగింది. ఇక ఉద్యమకారులను అవమానించారంటూ 2021 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. మరోవైపు 25 నవంబర్ 2021 న పార్టీకి రాజీనామా చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రవీందర్ సింగ్ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ 31 డిసెంబర్ 2021 న వ్యక్తిగతంగా పిలిపించుకొని తప్పకుండా ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.


బీఆర్ఎస్ తో కలిసి వచ్చిన కాలం..


ఇక సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి భారత రాష్ట్ర సమితి పార్టీని అనౌన్స్ చేసిన వెంటనే నార్త్ ఇండియాలో ముఖ్యపాత్ర పోషించే సిక్కు సామాజిక వర్గానికి చెందిన రవీందర్ సింగ్ కి కాలం కలిసి వచ్చింది. నార్త్ లో జరిగే తన వ్యక్తిగత, రాజకీయ పర్యటనల్లో సర్దార్ జీని వెంట వేసుకొని మరీ వెళ్లారు. సీఎం కేసీఆర్. ఇక కూతురు పెళ్లికి ప్రత్యేక అత్యధిక వచ్చి మరి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా నియమించారు. అయితే ఇదంతా ఇరువురు కీలక నేతల మధ్య సఖ్యత కుదిరించే క్రమంలో సీఎం దూర దృష్టితో ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయించుకున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకే శాఖకు చెందిన పదవి ఇవ్వడంతో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుందని రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవని సీఎం సూచించినట్లు సమాచారం.