ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా "మాండోస్" గా ఉచ్ఛరించిన తీవ్ర తుపాను దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనిస్తోంది. ట్రింకోమలీ (శ్రీలంక)కి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంలో 350 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది.


మాండోస్‌ ఈ రోజు తీవ్ర తుపానుగా మారనుంది.  సాయంత్రానికి క్రమంగా బలహీనపడి తుపానుగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలపై ప్రభావం చూపనుంది. ఈ రోజు అర్ధరాత్రి గరిష్టంగా 65-75 కిలోమీటర్ల వేగంతో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.


పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు 


ఈ మాండోస్‌ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను... ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరులో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది. 


తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికార యంత్రాంగ అప్రమత్తమైంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమ్మయ్య, కడప జిల్లాల అధికారులతో సీఎస్‌ జవహర్ రెడ్డి సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 


ఈదురు గాలులు..


తుపాను ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన "మాండూస్" అనే పేరు పెట్టనున్నారు. ఈనెల 15వ తేదీన అండమాన్ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. 


మాండోస్ తుఫాను పేరు కొంచెం భిన్నంగా ఉన్నా భారీ ముప్పుగా మన రాష్ట్రానికి మారనుందని ఏపీ వెదర్‌ మ్యాన్ చెప్పారు.  చెన్నైకి దగ్గరలో తీరం తాకే ఈ భారీ తుఫాను డిసెంబరు 10 న తీరాన్ని తాకి అదే రోజున తిరుపతి జిల్లా మీదుగా రాయలసీమ లోకి ప్రవేశిస్తుంది. దీని వలన తిరుపతి నగరంతోపాటుగా తిరుమల​, తిరుపతి జిల్లాలోని వివిధ భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలతో పాటుగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ అతిభారీ వర్షాలను పడే అవకాశం ఉందట. ఒక పక్క గాలులు, మరోవైపు వర్షం. కాబట్టి డిసెంబరు 9 రాత్రి నుంచి 10 మధ్యాహ్నం వరకు వాతావరణం చాలా వైల్డ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ తుపాను పూర్తి ప్రతాపాన్ని ఆ సమయంలో చూడగలమన్నారు. ఇప్పుడు మాత్రం సినిమా మొదటనే ఉన్నాం కాబట్టి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను కొనసీమ​, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, బాపట్ల​, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చూడగలమన్నారు. 


తెలంగాణ వెదర్ రిపోర్టు ఇలా.. 


తెలంగాణలో మాత్రం వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి - కొత్తగూడెం వంటి తూర్పు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగర శివార్లలో విస్తృతంగా దట్టమైన పొగమంచు కనిపిస్తుంది.