మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన రూబీ లాడ్జి ఘటన అనేక విషయాలను స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంచింది. అనుమతుల సంగతి దేవుడెరుగు కనీసం ఆపత్కాలంలో ప్రాణాలు పోకుండా కాపాడడానికి కనీస సౌకర్యాలు లేకపోవడం అధికారులు యజమానుల అలసత్వాన్ని చూపిస్తోంది. కరీంనగర్ లోను ఇలాంటి భవనాలు విచ్చలవిడిగా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న వీటిని గుర్తించకపోవడం పట్ల పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అగ్నిమాపక శాఖ అధికారులు వేర్వేరుగా చేపట్టిన పరిశీలనల్లోనూ వాస్తవాలు వారి దృష్టికి వచ్చాయి. తాజాగా సికింద్రాబాద్ జరిగిన ఘటన తెలిసిందే. 


కరీంనగర్ రామగుండం కార్పొరేషన్ల తో పాటు మరో 14 పురపాలికల్లో వ్యాపారాలను కొనసాగించే భవనాల సంఖ్య వేలల్లో ఉంటుంది. పెద్ద పట్టణాలలో పెరుగుతున్న వ్యాపారం దృష్ట్యా అన్ని రకాల వ్యాపారాలకు బహుళ అంతస్తుల నే ఆవాసంగా మార్చుకున్నారు. వాస్తవానికి భవన నిర్మాణ దశలోనే ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసుల చట్టప్రకారం ముందుగానే అనుమతులు తీసుకుని వారి సూచనల మేరకు నిర్మాణాలు ఉంటాయి.అగ్ని ప్రమాదం నుంచి రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే అవి జరిగినా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం అత్యవసరం. పాఠశాలలు వ్యాపార వాణిజ్య సముదాయాలు చిన్నపాటి ఫైర్ ఎక్స్‌టిన్షర్లు, రెండు డ్రమ్ముల ఇసుక, నీరు ఎప్పుడూ నిల్వ ఉంచుకోవడం మంచిది. వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రమాదాల నివారణపై శిక్షణ పొంది ఉండటం ప్రయోజనకరం. వెంటనే మంటలను ఆర్పే సిలిండర్ లు ఏర్పాటు చేయాలి. 


ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పెట్రోల్ బంకుల్లో ఖాళీగా కనిపిస్తున్న ఇసుక బకెట్లను ఎప్పటికప్పుడు నిండుగా ఉంచాలి. పని చేసే సిబ్బంది మంటలను ఆర్పేలా శిక్షణ ఇవ్వాలి. చాలా చోట్ల షాపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటి విషయమై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. టపాసుల దుకాణాలపై దృష్టి పెట్టాలి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, పెద్దపల్లి, జమ్మికుంట, హుజురాబాద్, మెట్పల్లి, కోరుట్ల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు ఉన్నాయి. అగ్నిమాపక నిబంధనలు పాటించేవి చాలా తక్కువగా ఉన్నాయి.ఇరుకుగా ఉన్న అద్దెల కోసం ఎందుకు, దేనికి అని చూడకుండా వారికి నచ్చినట్టుగా అన్నింటికీ అనుమతిస్తున్నారు. 


దీంతో అందులోని పలు రకాల వాణిజ్య, వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఏ చిన్న తప్పు జరిగినా కూడా అందరూ ఇబ్బందుల పాలవుతారు. వస్త్ర, ఆసుపత్రి, హోటళ్లు ఇలాంటి వ్యాపారాల చెంతకు జనాలు ఎక్కువగా వస్తుంటారు. ఇలాంటి చోట్ల మాత్రం ఇబ్బంది ఉంది. ఫైర్ ఇంజిన్ సులువుగా భవనం చుట్టూ తిరిగేలా దారి ఉండకపోగా నీళ్లను ఆర్పేలా పరికరాల ఊసే కనబడదు. భవనాల చుట్టూరా చెత్తాచెదారం పోగు చేస్తున్నారు. చాలాచోట్ల అన్ని అంతస్తులను సీలింగ్ చేస్తుండడం, ఏసీలు నడుస్తుండటంతో వేడి పుట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆపదలో మంటలను ఆర్పేలా కనీసం చిన్నవైన ఫైర్ ఎక్స్‌టిన్షర్లు కూడా ఎక్కడా కనిపించవు. ఆయా శాఖల సమన్వయ లోపమే ప్రమాదాలకు శాపంగా మారుతుందనేది స్పష్టమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల తీరుని పోలీసు, అగ్నిమాపక, పుర, నగరపాలిక, రెవెన్యూ అధికారులు వేర్వేరుగా కొనసాగించాలి. దీంతో పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టే విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.