Rains in Telangana AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తగ్గింది. వాయుగుండం ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, యానాంలలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా.. తెలంగాణలలో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. వర్షాల ప్రభావం తగ్గడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు వాతావరణ కేంద్రం.  
తెలంగాణలో వర్షాలు 
రాష్ట్రంలో వర్షాలు క్రమంగా తగ్గుతున్నాయి. వారం రోజుల తరువాత తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.  నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 22, గరిష్ట ఉష్ణోగ్రత 30గా నమోదైంది. నైరుతి దిశ నుంచి గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు  కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు తగ్గినా.. కొన్నిచోట్ల నేడు సైతం వర్షాలు కురుస్తాయి. తూర్పు గోదావరి, యానాం, పశ్చిమ గోదావరిలలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలల్లో ఉన్నంత వర్షపాతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నమోదు కాదు. ఈ ప్రాంతాల్లో నేడు సాధారణ వర్షపాతం నమోదు కానుంది. పశ్చిమ గాలులు బలపడుతున్నాయి కనుక తిరుపతి నగరంలో, చిత్తూరు జిల్లాలో వర్షాలు, నెల్లూరు జిల్లాకు విస్తరించి అక్కడ నుంచి కొనసీమ జిల్లాలోకి విస్తరించనున్నాయి. తమిళనాడు - ఆంధ్ర సరిహద్దు భాగాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, క్రిష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలుంటాయి. 


భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.