కరీంనగర్ పట్టణంలో కోతి భయం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇంటి డోర్లు తెరిచి ఉంచడంతో లోనికి వచ్చిన ఓ కోతి కుమారుడిపై కూర్చుని ఉంది. భార్య కోతి కోతి అని అరవడంతో ఒక్కసారిగా నిద్రలేచిన వ్యక్తి కుమారుడిపై కోతి కూర్చొని ఉండడం చూసి టెన్షన్ పడ్డాడు. షాక్‌కు గురవడంతో కళ్లుతిరిగి పడిపోయారు. గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచారని తెలియడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కోతి కోతి అని అరిచిన భార్య..
కరీంనగర్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో రుద్రోజు రాజు అనే వ్యక్తి తన కుటుంబంతో సహా నివసిస్తున్నారు. రాజుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున దాదాపుగా 5 గంటల ప్రాంతంలో నల్లా వస్తుందని రాజు భార్య ఉదయాన్నే లేచి ఇంటి పని చూసుకుంటున్నారు. మరోవైపు తలుపులు తెరిచి ఉంచడంతో ఓ కోతి ఇంట్లోకి చొరబడింది. నేరుగా వెళ్లి రాజు కుమారునిపై కూర్చొని ఉంది అయితే ఇంటి పని చేసుకుంటున్న రాజు భార్య తిరిగి లోపలికి వచ్చి చూడగానే ఎదురుగా తన కుమారుడి పై కూర్చొని ఉన్న కోతి కనిపించింది. దీంతో ఒక్కసారిగా కోతి కోతి అని గట్టిగా అరవడంతో ఆ అరుపులకు భర్తతోపాటు కుమారులు కూడా లేచారు. అయితే ఆకస్మికంగా లేచిన రాజు కోతిని చూసి ఒక్కసారిగా భయానికి గురై షాక్ లో ఉండిపోయాడు. కోతి అని గట్టిగా అరుస్తూనే వెనక్కి పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, ఇంటి చుట్టుపక్కల వారు కలిసి వెంటనే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సమయం మించిపోయిందని ఇంటి వద్ద గుండెపోటు రావడంతో రాజు ప్రాణాలు విడిచాడని డాక్టర్లు ధ్రువీకరించినట్లు సమాచారం.
ఉపాధి కోసం కరీంనగర్‌కు వలస..
ఇంటి పెద్ద ఆకస్మికంగా మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వరంగల్ కి చెందిన రాజు ఉపాధి నిమిత్తం కరీంనగర్ కి వచ్చి సెటిల్ అయ్యారు మెకానిక్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జరిగిన సంఘటనపై హనుమాన్ నగర్ కాలనీవాసులు మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కోతుల బెడద నుండి రక్షించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దీంతో ఏకంగా ఓ ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహిస్తున్నారు.
పట్టణంలో కోతుల దండు
విస్తీర్ణం పరంగా కరీంనగర్ పట్టణం చాలా తక్కువ వైశాల్యంతో ఉంటుంది. చుట్టుపక్కల గతంలో పచ్చని చెట్లు ఎత్తైన గుట్టలతో ఉండే ఈ నగరానికి గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణ సమస్యలు మొదలైంది. పట్టణం చుట్టూ దాదాపుగా 30 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉన్న గుట్టలన్ని గ్రానైట్ డిమాండ్ కారణంగా మాయమయ్యాయి. ఇక్కడ రాయికి ఉన్న ప్రపంచవ్యాప్త డిమాండ్ కోతులు ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి జీవాలకు ఆవాసాలైనా గుట్టలు, అడవులు లేకుండా చేసింది. దీంతో అవి తరచూ ఆహారం కోసం పట్టణం పోయి పడటం సర్వసాధారణంగా మారింది. గుంపులు గుంపులుగా వచ్చి పలువురు పై దాడి చేయడం వల్ల అనేకసార్లు ప్రజలు గాయాలపాలయ్యారు. ఇక శాతవాహన యూనివర్సిటీలో హల్చల్ చేసిన ఎలుగుబంటి ఇప్పటికి దొరకలేదు. ఇలా పర్యావరణ విధ్వంసం కారణంగా అడవుల్లో ఉండాల్సిన జీవాలు నగరంలోకి వస్తున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.