BTech Student Dies of Scorpion bite: సాధారణంగా వ్యవసాయ పనులలో రైతులకు, ఇతర వ్యవసాయ కూలీలకు పాములతో ప్రమాదం పొంచి ఉంటుంది. అత్యంత అరుదుగా తేలు కాటేయడం ద్వారా వారు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అయితే ఓ బీటెక్ విద్యార్థిని తమ తల్లిదండ్రులకు సహాయ పడతామని వెళ్లగా విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల్లో పాలుపంచుకోగా తేలు కాటు వేయడంతో ఏకంగా ప్రాణాల్ని కోల్పోయింది. ఈ విషాద సంఘటన సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని రగుడులో జరిగింది.
అసలేం జరిగింది?
రాజన్న సిరిసిల్ల కు చెందిన దొంతుల మాలతి(21) అనే యువతి హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే ఇటీవల సెలవులు రావడంతో తల్లిదండ్రులతో గడిపేందుకు తన స్వస్థలానికి వచ్చింది. వారికి వ్యవసాయ భూమి ఉండడంతో తరచూ ఆ పనుల్లో మాలతి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. అగ్రికల్చర్ పై ఆసక్తితో అప్పుడప్పుడు పంట పొలాలు పరిశీలిస్తూ స్వయంగా కొన్ని పనులు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లిన మాలతి మిగతా వ్యవసాయ కూలీలతో పాటు పని చేస్తూ ఉండగా తేలు ఆమె షర్టులోకి వెళ్లింది. బీటెక్ విద్యార్థిని మాలతి శరీరంపై తేలు పలుచోట్ల కాటేసింది.
నొప్పిని భరించలేక మాలతి వెంటనే అక్కడున్న వారికి చెప్పింది. అప్రమత్తమైన వారు వెంటనే మాలతికి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కి తరలించారు. ఆదివారం రోజు జరిగిన ఈ సంఘటనతో వారి కుటుంబీకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే చికిత్సతో కోలుకుంటుందనుకున్న ఆమె తల్లిదండ్రులకు మాలతి విగతజీవిగా మారడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో భవిష్యత్తు నిర్మించుకుంటున్న యువతి వ్యవసాయంపై తనకున్న ఆసక్తితో పొలం పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తేలు కాటు వల్ల ప్రాణం పోతుందా?
తేలు అనే విష కీటకం అరాగ్నిడా జంతు తరగతిలో స్కార్పియానిడా వర్గానికి చెందిన జీవి. ఇందులో రెండు వేల వరకు వివిధ రకాలైన జాతులున్నాయి. నిజానికి తేలులో ఉన్న రకరకాల ఉపజాతుల వల్ల చాలావరకు కాటు ప్రాణాంతకం కాదు. కానీ కుట్టినచోట తీవ్రమైన మంట నొప్పితో బాధితులు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నల్ల తేలు అత్యంత విషపూరితం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. కొందరికి తేలు కుట్టిన చోట మాత్రమే మంట, నొప్పి ఉంటుంది. అతి తక్కువ మందికి మాత్రమే కుట్టిన కాలు లేదా చేయి మొత్తం కూడా నొప్పితో విలవిల్లాడుతారు.
సుమారు 20 గంటల నుంచి ఒకరోజు వరకు కొంతమందికి ఈ నొప్పి ఉంటుంది. అయినప్పటికీ తేలు కాటుకు వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాంతకం కాదని తెలిసిందే. పలు గ్రామాల్లో ఇప్పటికీ తేలుకాటుకు నాటు వైద్యం పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆధునిక వైద్య విధానంలో తేలు నరాలపై కుడితే మాత్రమే చికిత్స అందుబాటులో ఉండడం వల్ల త్వరగా ఉపశమనం కోసం ఆయుర్వేదం ఇతర ట్రీట్మెంట్ల వైపు మొగ్గు చూపుతారు. అతి తక్కువ జాతుల తేల్ల వల్ల మాత్రమే ప్రాణాలు పోయేంత వరకు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.