జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.  ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇందుకు బాధ్యులుగా లష్కరే  తోయిబా కు అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్  ప్రకటించుకుంది. కాశ్మీర్ అంశమే ఈ దాడులకు కారణం అయినా ఈ సమయంలో దాడి వెనక ఉన్న మూడు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన వేళ...

కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా ఆకర్షింపజేసే ఉద్దేశంతోనే తరుచూ ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు దిగుతుంటారు.  370 ఆర్ఠికల్ రద్దు తర్వాత ఏర్పడిన ఈ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఇవాళ తన పంజా విసిరింది. అయితే  అది అదను చూసి అమెరికా ఉపాధ్యక్షుడు  జేడీ వాన్స్  మన దేశంలో పర్యటిస్తున్న తరుణంలో  అతి కిరాతంగా  టూరిస్టులను పొట్టనబెట్టుకుంది.  తద్వారా   అమెరికాతో పాటు అంతర్జాతీయంగా  ఆయా దేశాల్లో కాశ్మీర్  అంశాన్ని సజీవంగా చర్చలో ఉంచే ఉద్దేశం కనబడుతుంది. దీనిపై  ఇప్పుడు  మన దేశ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో పాటు అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,  యూకే దేశాలు,  పాకిస్థాన్, చైనా , టర్కీ , కెనడా వంటి దేశాలు , ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కాశ్మీర్ పై స్పందించాలని, ఇది అంతర్జాతీయ సమస్యగా చర్చించాలన్న కారణంతో తరుచూ ఉగ్ర  సంస్థలు ఇలాంటి కిరాతక ఘటనలకు పాల్పడుతుంటాయని అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతుంటారు.  పహల్గాం ఘటన కూడా ఇదే తరహాలో జరిగి ఉంటుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

2.  ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా..

 ఇక ఉగ్రదాడికి ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు ఏం సంబంధం అని అనుకోవచ్చు. కాని  పాకిస్థాన్, సౌదీల మధ్య ఇటీవలి కాలంలో శత్రుత్వం పెరిగిందనే చెప్పాలి.  రెండు దేశాలు ముస్లిం దేశాలు అయినా విదేశాంగ విధానం, వాణిజ్య పరమైన ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ కు అనుకూలంగా పాకిస్థాన్ వ్యవహరించడం సౌదీకి  నచ్చలేదు. సౌదీ అరేబియా - ఇరాన్ ల మధ్య పెద్ద ఎత్తున విబేధాలున్నాయి.  ఈ పరిస్థితుల్లో ఇరాన్ తో సంబంధాలు పాక్ పెంచుకోవడం  వల్ల  సౌదీ అరెబియా - పాక్ ల మధ్య  దూరం పెరిగింది.  ఇక  370 ఆర్ఠికల్ ను మన దేశం రద్దు చేసినపుడు దీనిపై   మద్ధతు ఇవ్వాలని సౌదీ నేతృత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్  ను పాక్ కోరింది. కాని సౌదీ అరేబియా మాత్రం కాశ్మీర్ అంశంపై  భారత్ ను  బహిరంగంగా తప్పుబట్టేందుకు ఇష్టపడలేదు. దీంతో పాక్  ఈ విషయమై సౌదీ పై గుర్రుగా ఉంది.  దీంతో పాటు ఇటీవలి కాలంలో సౌదీ  అరెబియా ఇండియాతో  వాణిజ్య సంబంధాలతో పాటు   ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు  ఏర్పరుచుకోవడం పాక్ కు సుతారం ఇష్టం లేదు. ఈ కారణాలు కూడా టీఆర్ఎస్ తో దాడి చేయించేందుకు పాక్ కు  ఓ ప్రేరణ కావచ్చని భద్రతా నిపుణులు చెబుతున్నారు. 

 3. పర్యాటకులను భయభ్రాంతులకు గురి చేసేందుకేనా...?

 ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో చాలా మార్పులు వచ్చాయి.  అక్కడ భూములను కొనుగోలు చేసే హక్కు అందరికి లభించింది.  అప్పటకి వరకు ఉన్ కాశ్మీర్ ప్రత్యేక చట్టాలు రద్దు అయి, భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది.  అంతే కాకుండా ఏ రాష్ట్రంలో వ్యక్తి అయినా  అక్కడి ఉద్యోగాలకు  దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా పర్యాటక రంగం కూడా  అభివృద్ది చెందింది. కాశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాలివుడ్ తో  పాటు  ఇతర భాషా చిత్రాల చిత్రీకరణ పెరిగింది.   ఓ మాటలో చెప్పాలంటే  370 ఆర్ఠికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో పరిస్థితి బాగుందన్న ప్రచారం బాగా సాగుతోంది. ఇది ముష్కర ఉగ్ర సంస్థలకు నచ్చడం లేదు.  కాశ్నీర్ తమది అని  భావిస్తోన్న ఈ  ఉగ్ర మూక  ఓ రకమైన భయబ్రాంతులు కలిగించే చర్యకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.  కాశ్మీరేతరులు వ్యాపారం  లేదా  పరిశ్రమలు స్థాపించకుండా, అక్కడి భూములను కొనుగోలు చేయకుండా, అక్కడి ఉద్యోగాలకు పోటీగా రాకుండా ఉండేలా పహల్గాం దాడి జరిగి ఉండవచ్చన్న చర్చ సాగుతోంది.  గతంలో ఉగ్రవాదుల దుశ్చర్యల వల్ల దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కాశ్మీర్ లోయకు రావడానికి జంకేవారు.  370 ఆర్టికల్ రద్దు తర్వాత పర్యాటకుల సంఖ్య పెరిగింది. వారికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాయి.  ఈ కారణంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని హింసకు దిగితే  దేశీయంగా, అంతర్జాతీయంగా ఓ ఉలికిపాటు కలిగించవచ్చన్నది టీఆర్ఎఫ్ నేతలు, పాక్  సైనిక నాయకత్వ దుష్టబుద్దిగా  అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతున్నారు.