Pahalgam Terror Attack | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. అయితే ఇది తమ పనేనని పాక్ కు చెందిన ఉగ్రసంస్థ స్పష్టం చేసింది. లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద శాఖ టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రదాడి చేసింది తామేనని మంగళవారమే క్లెయిమ్ చేసింది. ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు పాకిస్తాన్ ప్రభుత్వం పహల్గాంమ్ ఘటనపై స్పందించింది. అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. భారత ప్రభుత్వంపై దేశంలో ఉన్న వ్యతిరేకతే దాడికి పాల్పడేలా చేసి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశం అన్ని రకాల ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. 

పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడితో పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగాలాండ్ నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్‌లో నెలకొన్న అశాంతితో సహా భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఇది వారి దేశస్తుల పనే.. మాకు ఈ దాడితో ఏ సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు. దేశంలో అంతర్గతంగా చెలరేగిన చిచ్చు దాడికి కారణమై ఉంటుందని, దీన్ని పాక్ మీద రుద్ది చేతులు దులుపుకునే పని చేస్తున్నారని భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

"భారత్ లోని కేంద్ర ప్రభుత్వం నాగాలాండ్, మణిపూర్, కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో నిరసనలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం చాలా మందిని మోసం చేస్తుంది కనుక ఇది కచ్చితంగా స్వదేశీ దాడి అని ఆసిఫ్ అన్నారు. ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వం. స్థానిక దళాలు భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటే, పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని చెప్పారు.

కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో మంగళవారం మధ్యాహ్నం పాక్ కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉండగా, ఇద్దరు స్థానికులు ఉన్నారు. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులు. కాగా, 2019 లో జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన దాడి తర్వాత కాశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనం వెళ్తుంటే కాల్పులు జరిపి, పేల్చివేయడంతో జవాన్లు అమరులయ్యారు.

తాజాగా పహల్గాంలో మరణించిన 26 మందిలో ఒకరు యూఏఈ, ఒకరు నేపాల్‌కు చెందిన వారు కాగా, మిగతా వారు భారత్ కు చెందిన వారు అని అధికారులు తెలిపారు. పాక్ మాత్రం ఈ దాడితో తమకు సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో దాడి చేసి ఉంటారని కాకమ్మ కథలు చెప్పడం భారత్ కు మరింత కోపాన్ని తెప్పిస్తోంది.