పహల్గాం: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి కారణమైన ఉగ్రవాదుల అనుమానితుల ఊహాచిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ఉగ్రదాడిలో పాల్గొని కాల్పులు జరిపినట్లు అనుమానించబడుతున్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గాంలోని మంగళవారం ప్రధాన పర్యాటక ప్రదేశంపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపారు. మృతులలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయులు ఉండగా, ఇద్దరు స్థానికులు ఉన్నారు.
26 మంది మృతదేహాలను బుధవారం (ఏప్రిల్ 23న) తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి తరలించారు. ఆ తరువాత పోలీస్ కంట్రోల్ రూమ్‌కు షిఫ్ట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మృతులకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి శ్రీనగర్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిశారు. వారికి అండగా ఉంటామన్నారు. ఆయన పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశమైన బైసారన్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.
మృతుల కుటుంబాలకు భారీ పరిహారం..
పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన బాధితులకు రూ. 2 లక్షలు ప్రకటించింది. మంగళవారం జరిగిన ఉగ్రదాడిని విచారణ చేస్తున్న స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి ఇన్స్‌పెక్టర్ జనరల్ నేతృత్వంలోని ఎన్‌ఐఏ బృందం పహల్గాం వెళ్లింది. ఈ సమయంలో టికెట్ల ధరలు పెరగకుండా చూసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను కోరింది. విమానయాన సంస్థలు శ్రీనగర్ నగరానికి అదనపు విమానాలను కూడా నడుపుతాయని కేంద్రం తెలిపింది.
మోదీ సర్కార్ పై వ్యతిరేకత వల్లే ఉగ్రదాడి.. మాకు సంబంధం లేదన్న పాక్
పహల్గంలో ఉగ్రదాడిని అమెరికా సహా పలు దేశాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ మాత్రం ఈ ఉగ్రకుట్రతో తమకు సంబంధం లేదని చెబుతోంది. అనంత్ నాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై నేడు స్పందించిన పాక్ రక్షణ మంత్రి.. ఈ దుశ్చర్యకు పాక్ కాదు, భారత ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నాగాలాండ్, మణిపూర్, జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దాని ఫలితమే దేశంలోని కొన్ని శక్తులు చేసిన కాల్పుల ఘటన అని చెప్పడం భారత్‌కు మరింత కోపాన్ని తెస్తుంది.