Jagitial News: రెక్కాడితే డొక్కాడని కుటుంబం అది.. ఇంటి కుటుంబ పెద్ద అనారోగ్యంతో మరణించడంతో పెద్ద కుమారుడే అన్ని బాధ్యతలు తీసుకున్నాడు. అమ్మ, తమ్ముడు, చెల్లిని పోషించాలనుకున్నాడు. వారికి భూమి లేకపోవడం, పెద్దగా చదువు లేకపోవడంతో.. చిన్న వయసులోనే ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లాడు. తమ్ముడిని, చెల్లిని చదివించాలనే ఉద్దేశంతో డ్రైవర్ గా దుబాయిలో పని చేస్తుండగా లాటరీ రూపంలో ఆ యువకుడి అదృష్టం మారిపోయింది. అతని తోపాటు ఆ కుటుంబ పరిస్థితి కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా రూ.30 కోట్ల లాటరీ గెలుచుకున్న జగిత్యాల యువకుడి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు నిర్మాణ దశలో ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ఇక కోట్ల కొద్ది ప్రైజ్ మనీ రావడంతో చుట్టుపక్కల వారంతా యువకుడు ఓగుల అజయ్ తల్లిని, కుటుంబ సభ్యులను నోరు తీపి చేస్తూ అభినందిస్తున్నారు. తాము ఎదుర్కొన్న కష్టాలు తమ అబ్బాయి అజయ్‌కి వచ్చిన లాటరీ పట్ల కుటుంబ సభ్యుల స్పందన ఇదీ..


"మాది జగిత్యాల జిల్లా. బీర్ పూర్ మండలం, తుంగూరు గ్రాం. మాది చాలా పేద కుటుంబం. మాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. నా భర్త నేను చాయ్ హోటల్ పెట్టుకొని వీళ్లను సాకినం. తర్వాత నా భర్తకు 2016లో అనారోగ్యం వచ్చి చనిపోయిండు. ఆ తర్వాత నేను చాలా కుంగిపోయిన. నా పెద్ద కొడుకు వచ్చి.. అమ్మా నువ్వు కుంగిపోవద్దు. నీకు ఏది అచ్చినా నేను సూస్కుంట. నీ కష్టం, సుఖం కలిసి పంచుకుంట. తర్వాత మనకు జాగలు, పొలాలు ఇక్కడ ఏం లేవు. ఇడ ఉండి నేనేం చేయాలే. అట్ల బయట దేశం వెళ్లిండు. అక్కడే లైసెన్స్ తీసుకొని కంపెనీ డ్రైవర్ గా పని చేస్తుండు. అయితే అక్కడనే ఒక లాటరీ టికెట్ కొన్నడు. ఏవో నెంబర్లు కలిపిండట. లక్కీ డ్రా కంపెనీ నుంచి మెసేజ్ అచ్చిందట. ఫోన్ చేసి చెప్పిండు. మేము నమ్మలేము. కానీ తర్వాత నమ్మినం." - ప్రమీల, అజయ్ తల్లి 




"అమ్మా, నేను, అన్నయ్య, చెల్లి. నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. హైదరాబాద్ లో. మా అన్నయ్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ కంట్రీకి వలస వెళ్లిండు. అతనికి రీసెంట్ గా అతని బాస్ సలహా మేరకు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా లక్కీ డ్రాలో అతనికి ఇండియన్ కరెన్సీ ప్రకారం 33 కోట్లు క్యాష్ ను గెలుచుకున్నాడు. మెసేజ్ వచ్చినప్పుడు నమ్మలేము. కానీ తర్వాత రిలెటివ్స్ కి ఫోన్ చేసి తెలుసుకుంటే కన్ఫార్మ్ అని తెలిసింది. ఇక్కడ మా బంధువులతో పాటు గ్రామస్థులందరికీ ఇట్ల లక్కీ డ్రా గెలుచుకున్నట్లు చెప్పినం. సో సడెన్ గా అంత డబ్బు వచ్చేసరికి మేం ఇప్పుడు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం.  కోటీశ్వరులం అయినమే ఆనందం వచ్చింది. గెలిచినటువంటి డబ్బులను మా అన్నయ్య సోంత ఇల్లు నిర్మించుకోవడం, వివాహం చేసుకోవడం, మంచి వ్యాపారం ప్రారంభించాలనే ఆశతో ఉన్నడు. సో దుబాయ్ లో ఉన్న అతని కొలీగ్స్ కానీ, యజమాని కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నరు." - రాకేష్, అజయ్ సోదరుడు