ఓ మహిళా డాక్టర్ చేసిన పొరపాటు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు డెలివరీ చేసి ఆ డాక్టర్ పేషెంట్ కడుపులోనే కత్తెర మరిచిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఆరు సంవత్సరాల కిందట గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వచ్చింది. ప్రసవ సమయంలో ఆ డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. ఇన్నాళ్లూ ఈ ఘటన అస్సలు బయటికి రాలేదు.
ఇటీవల బాధితురాలైన మహిళకు కడుపు నొప్పి వచ్చింది. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు వెళ్లి స్కానింగ్ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్న విషయం బయటికి వచ్చింది. దీంతో బాధితురాలు గోదావరిఖనికి వచ్చి తనకు డెలివరీ చేసిన డాక్టర్ ని నిలదీసింది. దీంతో ఇరువురూ మాట్లాడుకొని వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు తెలిసింది. ఆపరేషన్ చేసి కడుపులో కత్తెరను తీసేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని మహిళా డాక్టర్ ఒప్పుకోవడంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించినట్లు సమాచారం.