Minister Harish Rao : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. అనంతరం హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అంతకుముందు నూతన వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాలుగేళ్ల పాలనలో ఒక్క రూపాయి పనిచేయలేదని అంటున్నారని, గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనుల్లో 10 కిలోమీటర్ల పనికిగాను 9 కిలోమీటర్ల 700 మీటర్ల పనిపూర్తయిందని చెప్పారు. మిగిలిన 300 మీటర్ల పనిని 45 రోజుల్లో పూర్తి చేయిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అదనంగా 86 కోట్ల 97 లక్షల రూపాయలను ప్రత్యేక జీవో ఇచ్చి మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పండుగ వాతావరణంలో గౌరవెల్లి ప్రాజెక్టును 45 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు.
ఇళ్లు కట్టుకునే వాళ్లకు ఆర్థికసాయం
హుస్నాబాద్ గడ్డమీద పుట్టిన వాళ్లు గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకొరని, ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే తగిన గుణపాఠం తప్పదన్నారు మంత్రి హరీశ్ రావు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే చింత, కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయం అంటే నిశ్చింత అని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, తెలంగాణలో రెట్టింపు వృద్ధిరేటు 8 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా రైతుబంధు రైతుల సంఖ్య రెట్టింపు చేసి ఇస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలను రైతుల సంఖ్యను తగ్గించి ఇస్తోందని ఎద్దేవా చేశారు. ప్రతి రాష్ట్రంలోని ప్రజలు, రైతులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు పెంచుతా, కూల్చుత అంటున్నారని, తెలంగాణ ప్రభుత్వంపై నిందలు, అనుమానాలు సృష్టిస్తున్నారన్నారన్నారు. నిందలు పెట్టి కూల్చుతామంటున్న కాంగ్రెస్, బీజేపీలు కావాలో, నిలబెట్టే కేసీఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. వచ్చే ఉగాదిన గర్భిణీల కోసం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తామని, దాని కోసం 250 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. అతి త్వరలో ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తూనే ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామన్నారు.
గౌరవెల్లి నిర్వాసితులు అరెస్టు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలవడానికి వచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వారిని వదిలిపెట్టినా ఇంటికి వెళ్లకుండా స్టేషన్ ముందు బైఠాయించి యువతులు ఆందోళన చేపట్టారు. తమను మహిళా పోలీసులు అకారణంగా కొట్టారని, మంత్రిని కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వస్తే కొడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు నచ్చ చెప్పడంతో వెళ్లిపోయారు. వెళ్లిపోయే క్రమంలో ఓ యువతి సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.