Jagtial Corrupted Fisheries Officer: ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోతుంది. చేతిలో డబ్బు పడితే గానీ.. పనిచేయమని తెగేసి చెప్పేస్తున్నారు కొందరు ఆఫీసర్లు. చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. లంచం ఇస్తే గానీ... పని సమయానికి జరగదు. ఒకవేళ డబ్బు ఇవ్వలేదో రోజుల తరబడి... ఆ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ఆ రూల్.. ఈ రూల్ అంటూ... తమ చుట్టూ తిప్పించుకుంటారు. ఇలాంటి అధికారుల తీరుతో ఎంతో మంది విసిగిపోయారు. తమకు తెలిసిన తీరుతో ఎదుర్కొంటున్నారు. కొందరు ఏసీబీ అధికారులను సంప్రదించి... అవినీతి అధికారులను పట్టిస్తున్నారు. కానీ జగిత్యాలతో మాత్రం అవినీతి అధికారికి వినూత్న రితీలో బుద్ధిచెప్పారు మత్స్యకారులు. చేపల సొసైటీలను విభజించేందుకు లంచం అడిగిన ఫిషరీస్ అధికారికి డబ్బుల దండ వేసి సత్కరించి... నిరసన వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రంగాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పరిధిలో కల్వకోట, భీమారం, బొమ్మెన గ్రామాలు ఉన్నాయి. ఇందులో నుంచి భీమారం గ్రామాన్ని విడదీసి కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని భావించారు మత్స్యకారులు. అందుకోసం మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌కు చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్‌ను కలిశారు. ప్రవీణ్ మత్స్యకారులతో కలిసి జిల్లా ఫిషరీస్ అధికారి దామోదర్‌ను కలిశారు. అయితే సంఘం సపరేషన్ కోసం కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో మత్స్యకారులు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు ఉత్తర్వుల కాపీని అధికారికి అందజేశారు. ఆ తర్వాత.. గ్రామానికి చెందిన మత్స్యకారులకు స్కిల్ టెస్ట్ పెట్టి సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అధికారి... తన బుద్ధి బయటపెట్టాడు. సంఘం ఏర్పాటు చేసేందుకు 50వేల రూపాయలు లంచం ఇవ్వాలని మధ్యవర్తులతో మత్స్యకారులకు చెప్పించాడు. పోనీలే అనుకున్న మత్స్యకారులు.. జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కు తెలియకుండా 50వేల రూపాయలు ఫిషరీస్ అధికారికి సమర్పించుకున్నారు. కానీ... ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చి.. ప్రక్రియ ఆగిపోయింది.
ఫిషరీస్ అధికారి దామోదర్.. మత్స్యకారుల నుంచి 50వేల రూపాయలు లంచం తీసుకున్నాడన్న విషయం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కు ఇటీవల తెలిసింది. దీంతో ఈ విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఈ విషయం ఫిషరీస్ అధికారికి తెలియడంతో... ప్రవీణ్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ప్రవీణ్‌కు పట్టరాని కోపం వచ్చింది. మత్స్యకారులతో కలిసి కలెక్టరేట్‌లోని ఫిషరీస్ అధికారి దామోదర్ ఆఫీసుకు వెళ్లాడు. సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. దీంతో దమోదర్ రెచ్చిపోయాడు. మత్స్యకారులను ఇష్టం వచ్చినట్టు దూషించాడు. తన సిబ్బందితో బయటికి గెంటిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అధికారి దామోదర్ తీరుతో విసిగిపోయిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ప్రవీణ్... వెంటనే కలెక్టరేట్‌లో ప్రజావాణికి వెళ్లి అధికారి దమోదర్‌పై ఫిర్యాదు చేశాడు. దామోదర్ లంచం డిమాండ్ చేశారని, ఏసీబీకి ఫిర్యాదు చేస్తే అంతుచూస్తానని బెదిరిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో... అక్కడ రభస జరగింది.
మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా... అధికారి దామోదర్ కూడా అక్కడికి వచ్చాడు. దీంతో... నోట్లతో తయారుచేసిన దండను అధికారి మెడలో వేసి నిరసన తెలిపాడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షుడు ప్రవీణ్. ప్రజావాణిలో అందరూ చూస్తుండగా... అధికారి మెడలో డబ్బుల దండ వేసి సత్కరించాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు... మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలిపారు.