సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి కొట్టడం దారుణమన్న ఆయన దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి జడ్జి ఆశ్చర్యపోయారని అన్నారు. కేయూ విద్యార్థులను వీసీ కొట్టించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందన్నారు. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని, విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈటల రాజేందర్. 


ముదిరాజ్‌లకు ఒక్క అసెంబ్లీ సీటు కేటాయించకపోవడంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని ముదిరాజ్ లు అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ముదిరాజ్‌లు శాసిస్తారని.. అలాంటి సామాజిక వర్గానికి కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ముదిరాజ్‌ల ఓట్లతో గెలిచిన విషయాన్ని మరచిపోవద్దని  గుర్తు చేశారు. ముదిరాజ్ తల్లి పాలు తాగానని చెప్పే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. 


ఓడిపోతామనే భయంతోనే రెండు చోట్ల


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ నిర్ణయంతో బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. కేసీఆర్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని కుటుంబ పాలన చేస్తూ.. తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. ఎవరికి ఓటు వేసినా కేసీఆర్​కు వేసినట్లేనని అన్నారు. బీఆర్ఎస్​కు సీట్లు తక్కువగా వచ్చినా.. కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకొని కేసీఆర్ గద్దెనెక్కుతారని ఈటల ఆరోపించారు. ఓట్ల సమయంలో పథకాల ఆశ చూపిస్తూ.. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని వివరించారు. 


మరోవైపు, ఈటల రాజేందర్ వ్యాఖ్యలను వరంగల్ సీపీ రంగనాథ్ ఖండించారు. కేయూ విద్యార్థులను తీసుకెళ్లి కొట్టారనేది అవాస్తవమన్న ఆయన లేని గాయాలకు విద్యార్థులు కట్టు కట్టుకున్నారని తెలిపారు. ప్రశాంత్‌ అనే విద్యార్థికి నెలరోజుల ఫ్రాక్చర్ అయిందన్న సీపీ అనుమానం ఉంటే విద్యార్థులకు మరెక్కడైనా వైద్య పరీక్షలు చేయించవచ్చన్నారు. మరోవైపు కాకతీయ వర్సిటీలో 12 విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేయూ వీసీ రమేశ్‌ను బర్తరఫ్‌ చేయడంతో పాటు విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 12న ఉమ్మడి వరంగల్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయ్, విద్యార్థి సంఘాలు.