Dalit Bandhu Scheme Amount: వచ్చే మార్చి నుంచి తెలంగాణలో దళిత బంధు నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్యాంకులతో అనుమతి లాంటి లింకులు లేకుండా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో దళిత బంధుని మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.


జనగామ కలెక్టర్ కార్యాలయంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి సోమవారం దళిత బంధు కార్యక్రమ రూపకల్పన, అమలుపై సమీక్షించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దేశంలోనే విశిష్టమైన, అరుదైన పథకం అన్నారు. 


సీఎం కేసీర్ ప్రవేశపెట్టిన అనేక నూతన పథకాల్లో దళిత బంధు వినూత్న పథకం అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 100 మందికి, రూ.10 లక్షల చొప్పున, బ్యాంక్ లింకేజ్ లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అయ్యే విధంగా పథకం రూపకల్పన చేశామన్నారు. లబ్ధిదారులు తమ జీవనోపాధికి ఉపయోగపడే ఆర్థిక ఉపాధి కార్యక్రమాలను రూపొందించుకోవాలని, తద్వారా వాళ్లంతా బాగుపడాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. జనగామ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు సమన్వయం చేయడానికి అధికారులను నియమించామని తెలిపారు. జనగామకు ఆర్డీవో మధు మోహన్, స్టేషన్ ఘనపూర్ కు డీ ఆర్డీవో రామ్ రెడ్డి, పాలకుర్తికి డీపీఓ రంగా చారీ ఇంచార్జీలుగా ఉంటారని తెలిపారు. 


స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 24,209 దళిత ఇండ్లు ఉండగా, 84,530 జనాభా ఉందని, పాలకుర్తి నియోజకవర్గం లో 19,093 ఇండ్లు ఉండగా.. 67,825 జనాభా ఉందని, జనగామ నియోజకవర్గంలో 17,516 ఇండ్లు ఉండగా.. 62,260 జనాభా ఉందని అన్నారు. ఈ మూడు నియోజక వర్గాల్లో 60,818 ఇండ్లు ఉండగా, 2,14,615 మంది దళిత జనాభా ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రజలంతా సమాన అవకాశాలు ఉండాలని, ఆర్థికంగా అంతా ఎదగాలని, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో వేసే కమిటీల అధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అంతా కలిసి కట్టుగా సమన్వయంతో పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చారు.


Also Read: Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...


 Also Read: Mulugu District: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే బాలికలకు ఈ సౌకర్యం.. మంత్రి సత్యవతి రాథోడ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి