National Girl Child Day 2022: మహిళల అన్ని సమస్యల పరిష్కారం కోసం వన్ స్టాప్ సెంటర్ గా పని చేస్తున్న సఖీ కేంద్ర శాశ్వత సొంత భవనాన్ని జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలో ప్రారంభించారు. మహిళలకు అత్యవసర పునరావాసం కోసం గదులు, పోలీస్ సాయం, న్యాయ సాయం, వైద్య సాయం వంటి అన్ని వసతులు కోసం రూ. 49 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రవాణా సదుపాయం పథకం (రూరల్ ట్రాన్స్‌పోర్టేషన్ స్కీం) కింద కోటి రూపాయల విలువైన 10 రవాణా వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను, మహిళా హెల్ప్ లైన్ 181 పోస్టర్‌ను సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. అంగన్వాడిలకు చీరలు పంపిణీ చేశారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆడ పిల్లల చదువులు ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ములుగులో నిర్మాణం జరుగుతున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం చల్వాయి క్రాస్ రోడ్ నుంచి లక్నవరం వరకు రోడ్డు అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయల పనులకు ఆమె శంఖుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏ.పి. ఓ వసంత్ రావు, ఈ.ఈ హేమలత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, జెడ్పీ సీఈవో ప్రసూన, జెడ్పీటీసీలు, ఎంపిపి, ఎంపీటీసీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బాలురకు సమానంగా.. ఇంకా ఎక్కువగా బాలికల విద్యకు, విద్యా సంస్థలలో డిజిటల్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో మనమంతా భాగమై బాలికలకు డిజిటల్ విద్య అందించి, వారి గొప్పతనాన్ని వెలికితీసి ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ఆడపిల్లల చదువులు ఆగిపోకూడదు అని విలేజ్ లెర్నింగ్ ప్రోగ్రాం కింద ఉపాధ్యాయులు విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠాలు చెప్పే విధంగా, వారి సందేహాలు తీర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల విద్య ఆగిపోకూడదు అనే గొప్ప సంకల్పంతో 53 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించి, నడిపిస్తున్నారన్నారు. అవసరమైతే మరిన్ని పెంచేందుకు, ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు, బాలికలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు పనిచేయకుండా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు ప్రతి నెల 2000 రూపాయల చొప్పున ఇస్తోందని, బాలిక పుడితే ప్రత్యేకంగా మరో రూ. 1000 అదనంగా కలిపి రూ. 13000 ఇస్తోందన్నారు.
బాలికల విద్యకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కోసం ఎప్పటికప్పుడు టీవీలు, రేడియోలు, అవుట్ డోర్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామ సభలు, మండల స్థాయిలో మహిళా సభలు నిర్వహిస్తూ భ్రూణ హత్యల నివారణ, బాలికల రక్షణ, విద్యపై తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తాం. నిరుపేద, అనాథ బాలికల జన్మదినోత్సవాలను నిర్వహిస్తూ వారికి సమాజం పట్ల నమ్మకం కల్పించే చర్యలు చేపడుతాం. అనాథలకు ఈ ప్రభుత్వమే తల్లి, తండ్రి అయి సంరక్షణ చేసే విధంగా, వారికి కుటుంబం ఏర్పాటు చేసే విధంగా త్వరలో సమగ్ర చట్టం తీసుకొస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఇస్తున్న ప్రాధాన్యత, వారి కోసం చేస్తున్న కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాలురు, బాలికల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యిందన్నారు. సీఎం కేసీఆర్ ఆడపిల్లల రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వీరి పట్ల దాడులు చేసిన వారిపట్ల, అమానుషంగా వ్యవహరించిన వారిపట్ల కఠినంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.
Also Read: Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...