ఉగాది పండుగ చేసుకునే పరిస్థితి లేదు, పల్లెల్లో విషాదఛాయలు- ఎమ్మెల్యే ఈటల
ఎక్కడో పంజాబ్ లో రైతులకు సీఎం కేసీఆర్ డబ్బులు ఇచ్చారని, కానీ రాష్ట్రంలోని రైతులకు నష్టం వస్తే ఆదుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పంట నష్టంతో హుజూరాబాద్ పల్లెల్లో పండుగ పూట విషాదఛాయలు అలుముకున్నాయి.. ఉగాది పండుగ చేసుకునే పరిస్థితి లేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎక్కడో పంజాబ్ రైతులకు డబ్బులు ఇచ్చి వచ్చుడు కాదు.. ఈ గడ్డమీద ఏడుస్తున్న రైతులను ఆదుకోవాలన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు.
ఎకరాకు 50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మీ సమీక్షలు రైతుల కడుపు నింపవు. ముసలికన్నీరు కాదు కావాల్సింది. రేకులు, పెంకుల ఇల్లు కూడా ధ్వంసం అయ్యాయి. సీఎం కేసీఆర్ స్పందించకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తాం. నష్టంపై కేంద్రానికి కూడా రిపోర్ట్ అందిస్తాం అన్నారు ఈటల. రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షం సృష్టించిన భీబత్సం రైతులకు కడగండ్లు మిగిలించింది. వడగళ్ల వానకు హిమాయత్ నగర్, రామకృష్ణపూర్, బ్రహ్మణపల్లి, మామిడలపల్లి, కోర్కల్, చల్లుర్, రెడ్డిపల్లె, మల్లారెడ్డి పల్లె, దేశాయ్ పల్లె, కాపుల పల్లె, సీతంపేట, బుజునురులో వేల ఎకరాల మక్క, మిరప తోటలు, వరి పొలాలు.. చేతికి అందిన పంట నేలపాలు అయింది.
ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎలాంటి బాధ ఉంటుందో అలాంటి విషాదఛాయలు తెలంగాణలో పలు గ్రామాల్లో ఉన్నాయన్నారు ఈటల. తెలుగు వారికి తొలి పండుగ ఉగాది ఉన్నా పండుగ లేని వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇంత విపత్తు సంభవించినా సీఎం కేసీఆర్ స్పందించలేదు. మంత్రులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదన్నారు. ప్రస్తుతానికి అధికారులు తుతూ మంత్రంగా వచ్చిపోతున్నారు తప్ప భరోసా ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ఇచ్చే పంట భీమా పథకం "ఫసల్ భీమా" రాష్ట్రంలో అమలు చెయ్యడం లేదు. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం అందడం లేదు. పోయిన సంవత్సరం నడికుడ ప్రాంతంలో ఇదే సీజన్లో మిర్చి పంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ఏడాది అయినా ఇవ్వడం లేదు. రైతుబందు ఇస్తున్నామని ఎలాంటి సాయం అందించడం లేదు. గతంలో అనేక వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇచ్చే వారు. ఫ్లౌలు, కల్టివేటర్లు, కేజీ వీల్స్, మందుకొట్టే పంపులు, తార్పాల్ ఇచ్చే వారు ఇప్పుడు అన్నీ బంద్ పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల అన్నారు.
సీఎం కేసీఆర్ వెంటనే నష్టపోయిన పంట అంచనాలు రైతు యూనిట్ గా తయారు చేసి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం అందించాలి. ఎక్కడో పంజాబ్ కి వెళ్లి రైతులకు 2 లక్షల డబ్బులు ఇచ్చి వచ్చుడు కాదు. తెలంగాణ గడ్డమీద ఉన్న రైతులు కన్నీళ్లు పెడుతుంటే పట్టించుకోరా? ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో కూర్చొని స్పందించరా ? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. వడగళ్ళ వానలు వస్తె ఆ రైతు ఐదేళ్లు వెనక్కు పోయినట్టేనని, ఇటీవల కేజీ పరిమాణంలో వగడాళ్లు కూడా పడ్డాయని, కనుక రైతులకు నిజమైనసాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.