లిక్కర్ వ్యాపారం, డీలింగ్స్ మహిళలు చేసే బిజినెస్ ఏనా.. లిక్కర్ స్కాం లో ఆడవాళ్ళు ఉంటారా అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మహిళా ఎమ్మెల్సీ కవితకు బిజినెస్ చేసుకోవడానికి ఈ పనే దొరికిందా? మహిళగా ఇది ఒక కళంకం అన్నారు. చట్టానికి సహకరించండి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. తన మీద దారినపోయే దానయ్య ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా కేబినెట్ నుంచి తనను కేసీఆర్ తొలగించారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం విచారణ అంటే ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు.
రాజకీయ కుట్ర కానే కాదు..
ఎమ్మెల్సీ కవిత విచారణ రాజకీయ కుట్ర అయితే అది కేవలం ఓ రాష్ట్రం వారిమీదనే విచారణ జరగాలని.. కానీ కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల వాళ్ళను విచారణ ఎందుకు చేస్తారని ఈటల ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో 6, 7 రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు ఇన్వాల్వ్ అయ్యాయన్నారు. రాజకీయ కుట్ర అయితే కోర్టు తేలుస్తుంది, మీరెందుకు భయపడుతున్నారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను సూటిగా అడిగారు.
తప్పు చేస్తే నా కొడుకు అయినా, బిడ్డనైనా వదిలిపెట్టను అని స్వయంగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గుర్తుచేశారు. మరి తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయపరమైన వేధింపులు అని రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు. స్పష్టంగా అర్థమైంది తెలంగాణ రాష్ట్రంలో సంపాదన సరిపోదు అన్నట్టుగా కుటుంబ పాలనలో ఢిల్లీ దాకా ఎగబాకారు కేసీఆర్. బిఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సరిపోవడం లేదు దేశవ్యాప్తంగా విస్తరిద్దామని అనుకుంటున్నారా? తప్పు చేశారా లేదా అనేది ఏజెన్సీలు తెలుస్తాయి. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మీద సంపూర్ణ నమ్మకం ఉన్నవాళ్ళం. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు అని పునరుద్ఘాటించారు.
నమ్మించేలా అబద్దాలు చెప్పగల నేత కేసీఆర్
కేసీఆర్ అబద్ధాలు కూడా ప్రజలలను నమ్మించే విధంగా చెప్పగలరు. మీరు దాచుకొండి దోచుకొండి.. మీకు ఆపద వచ్చినప్పుడు మీకు అండగా ఉంటామని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏమన్నా రాసి ఇచ్చారా? మీకు కష్టం రాగానే కాపాడండి అని అడగడానికి అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అడిషనల్ అడ్వకెట్ జనరల్ కవిత వెంట ఎలా పోతున్నారు. లిక్కర్ స్కాంకి వారికి ఏంటి సంబంధం. మంత్రులకు లిక్కర్ స్కాం కి ఏం సంబంధం అని ఎమ్మెల్యే ఈటల ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ఎలా ఖర్చు పెడుతున్నారని అడిగారు.
దారిలో పోయే దానయ్య కంప్లైంట్ చేస్తే నన్ను మంత్రివర్గం నుంచి తీసివేసావ్. కనీసం విచారణ కూడా చేయలేదు. విచారణ చేయకుండానే తొలగించావు. హుజురాబాద్ వస్తివి.. దెబ్బలు తింటివి.. ఈటల రాజేందర్ తప్పు చేశారా? సీఎం కేసీఆర్ తప్పు చేశారా అని అడిగితే ప్రజలు తమ ఓటుతో తేల్చి చెప్పారు. మీమీద ఆరోపణలు వస్తే మాత్రం విచారణ ఎదుర్కోడనికి ఎందుకు వెనక్కు పోతున్నారని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలను బీజేపీ ఎమ్మెల్యే ఈటల ప్రశ్నించారు.