Bhadradri News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి.. భవన యజమాని తాళం వేశారు. 2019వ సంవత్సరం నుంచి నేటి వరకు అద్దె చెల్లించిన కారణంగానే.. తాళం వేశానని ఇంటి యజమాని లక్కోజు విష్ణువర్ధన్ రావు తెలిపారు. ఏం చేయాలో పాలుపోని సిబ్బంది భవనం బయటే నిలబడిపోయారు. పలు ధ్రువ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కూడా అక్కడే నిలబడ్డారు. 




"సబ్ రిజిస్ట్రార్ అఫీస్ కోసం నేను 2009లో ఇంటిని రెంట్ కు ఇచ్చాను. పదేళ్ల కాలం పాటు బాగానే అద్దె డబ్బులు చెల్లించారు. కానీ 2019 నుంచి నాకు సమస్య వస్తుంది. అస్సలు రెంట్ ఇవ్వట్లేదు. అధికారులకు, వాళ్లకు, వీళ్లకు అందరికీ చెప్పాను. జిల్లా అధికారులకు చెప్పాను, రాష్ట్ర అధికారులకు కూడా చెప్పాను. నెలా నెలా వచ్చే దాంట్లో బిల్ వస్తుంది కానీ వీళ్లు అద్దె చెల్లించట్లేదు. 2019 నుంచి నాకు ఇంతవరకు ఏమీ ఇవ్వలేరు. రూపాయి కూడా ఇవ్వలేరు. అందుకే ఏది ఏమైనా సరే తాళం వేద్దామనుకున్నాను. ఫర్దర్ గా తాళం వేసిన తర్వాత కూడా డబ్బులు రాకపోతే నేను కోర్టుకు కూడా వెళ్తాను." - లక్కోజు విష్ణువర్ధన్ రావు 


రెండు నెలల క్రితం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్..


మన ఊరు-మన బడి పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశాడు. కరీంనగర్ జిల్లాలో మరో కాంట్రాక్టర్ తన ప్రతాపం చూపించాడు. బిల్లులు కట్టడం లేదంటూ ఒక రోజు కిందటే కొత్తపల్లిలో ఒక కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేయగా అదే విధంగా మరో కాంట్రాక్టర్ తాళం వేసి తన నిరసన తెలిపాడు.  వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ తదితర పనుల కోసం రూ.ఐదు లక్షలకు పైగా టెండర్ ను సురేందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకొన్నాడు. జూన్ నెలలో కొంత వరకు పనులు పూర్తి చేశాడు. అయితే ఇప్పటి వరకు పైసా చెల్లించలేదని, దాదాపుగా మూడు లక్షల అప్పు తెచ్చి పనులు పూర్తి చేశారని, ఇప్పటి వరకూ పైసా చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నాడు. ఇబ్బందులు పడుతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేరుగా స్కూల్ కి వచ్చి తాళం వేయడంతో విద్యార్థులు పాఠశాల సిబ్బంది కంగుతిన్నారు. అయితే మొదట ఇదే పని చేసినా కొత్తపల్లి కాంట్రాక్టర్ పై పోలీసు కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు పాఠశాల సిబ్బంది. తాము ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇలా చేయడం తప్ప వేరే దారి లేదంటూ కాంట్రాక్టర్లు తిరుగుబాటు చేస్తున్నారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. 


మరో ఘటన...


తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా  మన ఊరు -మన బడి పథకం చేపట్టింది. ఈ పథకం కింద అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని ఓ కాంట్రాక్టర్ తాళం వేశారు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్, కాంట్రాక్టర్ శ్రీకాంత్ కు ప్రభుత్వం నుంచి రూ.4.4 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ క్లాస్ రూమ్‌లకు తాళం వేశారు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులంతా తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంజినీరింగ్ అధికారులు చెప్పిన ప్రకారం పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. తాను అప్పు చేసి పనులు పూర్తి చేశానని, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నానని కాంట్రాక్టర్ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లించాలని ఎన్ని సార్లు కోరినా ఫలితంలేకనే క్లాస్ రూమ్ లకు తాళం వేశానని చెప్పారు. తనకు రావాల్సిన రూ.4.4 లక్షల బిల్లులు మంజూరు చేసేంత వరకు తాళం తీసేది లేదని శ్రీకాంత్ తేల్చిచెప్పారు.