జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ సంఘటన మానవత్వానికి మాయని మచ్చలా మిగిలింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు ఆమె పట్ల దారుణంగా వ్యవహరించారు. బంధువులతో సహా అబ్బాయి వారి ఇంటి పై మారణాయుధాలతో దాడికి దిగి కుమార్తెని అక్కడి నుంచి కారులో బలవంతంగా తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా కన్నబిడ్డ అనే మమకారాన్ని సైతం మరిచిపోయి తీవ్రంగా కొడుతూ కారులోనే శిరో ముండనం చేయించారు. పైగా చిత్రహింసలు పెడుతూ అతన్ని వదిలి రావాలన్నారు. ఆమె మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ అమ్మాయి మాత్రం తల్లిదండ్రుల మాటలు పట్టించుకోలేదు. వారి ప్రవర్తన పట్ల తీవ్రంగా ప్రతిఘటించింది తనకు కట్టుకున్నోడే కావాలంటూ చివరికి పోలీస్ స్టేషన్ కి చేరింది.


జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత ప్రేమించుకున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పారు. తాము ఒకరినొకరు ఇష్టపడుతున్నామని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డామన్నారు. ఆ ప్రపోజల్‌ను యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇక విధిలేని పరిస్థితిలో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. 


కొద్ది రోజులపాటు సైలెంట్‌గా ఉన్న అమ్మాయి తరఫు తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం రోజున రియాక్ట్ అయ్యారు. అక్షిత తన అత్తవారింట్లో ఉన్న విషయాన్ని గమనించారు. మారణాయుధాలతో రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంతోపాటు.. అమ్మాయి కిడ్నాప్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన చుట్టుపక్కల వారిపై సైతం దాడికి దిగారు. దీంతో అందరూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరికి తీవ్ర గాయాలు కాగా అమ్మాయిని మాత్రం బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. 


అలా అమ్మాయిని తీసుకెళ్తూనే తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగని వారు ఆమె కేకలు వేస్తున్న వదలకుండా శిరోముండనం చేయించారు. ఈ చర్యలను తీవ్రంగా ప్రతిఘటించిన అక్షిత... వారి బారి నుంచి తప్పించుకొని వచ్చిన సోమవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన ఘాతుకాన్ని వివరించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. 


ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఈ సంఘటనలో పాల్గొన్న ఎవరిని ఉపేక్షించబోమని అమ్మాయి పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని చట్ట ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు. 


జరిగిన సంఘటన పట్ల పలు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రీ ప్లాన్ట్‌గా కన్న కూతురిపైనే దారుణానికి పాల్పడ్డ తల్లిదండ్రులతో పాటు వారికి సహకరించిన బంధువులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.