Amit Shah in Telangana: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 3న మరోసారి దీపావళి జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభం అయ్యే సమయంలో మూడోసారి దీపావళి వస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు అమిత్ షా హాజరై మాట్లాడారు. 


అంతకుముందు జనగామ జిల్లా కేంద్రంలో కూడా అమిత్ షా మాట్లాడారు. స్థానిక ప్రెస్టన్ మైదానంలో జరిగిన సభలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఓవైసీ, ఇతర నాయకులకు భయపడి కేసీఆర్ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని విస్మరించారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి చూపిస్తామని చెప్పారు. బైరాన్ పల్లిలో రజాకార్ల చేతిలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. అక్కడ అమరుల కోసం స్మారక స్థూపాన్ని నిర్మిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ జనగామకు ఇచ్చిన పాలిటెక్నిక్ కాలేజీ హామీ నెరవేరనేలేదని అన్నారు. అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాలకు పాల్పడే వాళ్లేనని అమిత్ షా విమర్శించారు.