Congress Targerts 60 Seats In Telangana Assembly Elections 2023: తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP)అగ్రనేతలు వరుసగా ర్యాలీలు, సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. విరామం లేకుండా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. నేతల మధ్య మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ఈసారి సీన్‌ మరోలా ఉంటుందని కాంగ్రెస్‌ నమ్ముతోంది. కర్ణాటక ఫలితాల తర్వాత హస్తం పార్టీకి కొత్త ఊపొచ్చింది. కర్ణాటకలో ఫైవ్ పాయింట్ ఫార్ములా సక్సెస్‌ కావడంతో తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్‌లను ప్రకటించింది. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతిని, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేసింది. ఇక్కడ కూడా అదే పంథాను అనుసరించనుంది. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ముందుకు వెళ్తోంది. దశాబ్దం కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా  అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేసింది. 


60 దాటని కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో ఈ సారి అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 70 నుంచి 80 సీట్లు వస్తాయని సభలు, సమావేశాల్లో పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సంగతి పక్కన పెడితే, గతంలో ఎన్ని సీట్లు సాధించిందన్న దానిపై లెక్కలు తీస్తున్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ నాయకత్వానికే పట్టంకట్టారు. మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్‌ 60. గత 30 ఏళ్లలో ఎప్పుడైనా కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణలో 60 సీట్లు సాధించిందా అంటే సమాధానం లేదు . తొలి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 22 సీట్లు వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 సీట్లు మాత్రమే వచ్చాయి.  కాంగ్రెస్ పార్టీ 2004, 2009లో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో హస్తం పార్టీకి 185 సీట్లు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవి 48 మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో కాంగ్రెస్‌కు 156 సీట్లు వచ్చాయి. ఇందులో తెలంగాణలో వచ్చింది కేవలం 49 సీట్లే. తెలుగుదేశం పార్టీ 1994, 1999 వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేదు.


1989లో అత్యధికంగా 59 సీట్లు
1999 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు 42 సీట్లు వచ్చాయి. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉమ్మడి ఏపీ అంతా కలిపి వచ్చింది కేవలం 26సీట్లు. 1989లో కాంగ్రెస్‌కు 181 సీట్లు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవి 59 సీట్లు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వచ్చిన అత్యధికం 59. అది కూడా 1989లో. గత 30 ఏళ్ల చరిత్ర తీసుకుంటే, కాంగ్రెస్‌కు తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59 మాత్రమే. 60 సీట్లు ఏ నాడూ దాటలేదు. గత రికార్డులను పరిశీలిస్తే, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో సాధించిన అంతంతమాత్రమే. ఈ సారి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ అందనంత భారీ విజయాన్ని అందుకోవాలి. మేజిక్ ఫిగర్ ను దాటాలంటే, 30 ఏళ్ల క్రితం ఎలా గెలిచిందో, ఇపుడు అలాంటి ప్రదర్శనే చేయాల్సి ఉంటుంది.