Karimnagar News: కరీంనగర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. ఉదయాన్నే లేచి కాసేపు ఆడుకున్న తర్వాత కళ్లు తిరిగి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. తర్వాత వైద్యులు చెప్పిన విషయాలు విన్న కుటుంబం అయ్యో అని కన్నీళ్లు పెట్టుకుంది. 


కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నివాసం ఉంటున్న రాజు-జమున దంపతుల ఐదేళ్ల కుమార్తె గుండెపోటుతో మృతి చెందింది. ఉదయాన్నే నిద్రలేచిన పాప కాసేపు ఆడుకుంది. అలసిపోయిన బాలిక కళ్లుతిరిగి పడిపోయింది. ఏం జరిగిందో తెలియని ఆ తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేశారు. చికిత్స అందించిన తర్వాత కూడా పాప కళ్లు తెరవకపోవడంతో హన్మకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 


పాపను వెంటనే జమ్మికుంట నుంచి హన్మకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. అక్కడ వైద్యులు పరీక్షలు చేస్తుండగానే పాప కన్నుమూసింది. అప్పటి వరకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి ఒక్కసారిగా ఇలా మృతి చెందడంతో ఆ దంపతులు బోరుమన్నారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 


అప్పటికే పరీక్షలు చేసిన వైద్యులు... పాపకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు తెలిపారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని అందుకే అకస్మాత్తుగా పాప పడిపోయిందని అన్నారు. ఆడుకుంటున్న టైంలో గుండెపోటు వచ్చి ఉంటుందని అంటున్నారు. 


చిన్నారుల్లో గుండె సంబంధిత వ్యాధులు గుర్తించడం ఎలా?(Heart Problems In Child Symptoms)
చిన్నారు‌ల్లో వ్యాధులు గుర్తించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా జరిగే వరకు అసలు అలాంటి వ్యాధి ఉన్నట్టు తల్లిదండ్రులకు తెలియదు. అయితే ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు తరచూ కనిపిస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. వారిని జాగ్రత్తగా గమనిస్తే కచ్చితంగా ముందుగానే హార్ట్‌ డిసీజ్‌లను గుర్తించవచ్చని అంటున్నారు. 


అలసిపోవడం 
చిన్నారులు ఎంతగా ఆడినా త్వరగా అలసిపోరు. అందుకే ఎవరైనా త్వరగా అలసిపోయినట్టు గమనిస్తే కచ్చితంగా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెసంబంధిత వ్యాధులు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయని అంటున్నారు. అలసిపోవడమే కాకుండా ఊపిరి తీసుకోవడానికి కూడా ఇలాంటి పిల్లలు ఇబ్బంది పడతారు. 


నీరసించిపోవడం 
ఎంత తిన్నా ఏం చేసినా కొందరు పిల్లలు త్వరగా నీరసించిపోతారు. కాస్త పరిగెత్తినా, ఆడుకున్నా కాసేపటికే కూలబడిపోతారు. నా వల్ల కాదు అంటూ కూర్చుంటారు. మరికొందరు అయితే అలసిపోవడమే కాకుండా స్పృహతప్పిపోతారు. 


వాపు రావడం  
కొందరు పిల్లలకు కీళ్ల వద్ద చేతుల జాయింట్స్‌లో వాపు వస్తుంటుంది. 


మరికొన్ని లక్షణాలు


బరువు పెరగడంలో చిన్నారు ఇబ్బంది పడుతుంటారు. ఎంత తిన్నా, ఏం చేసిన బరువు పెరగరు. వయసుకు, ఎత్తుకు తగ్గ బరువు కనిపించకపోతే కచ్చితంగా పరీక్షలు చేయించాలి.


పెదవులు, నాలుక, గోళ్లు  నీలిరంగు రంగులో ఉంటే కూడా వైద్యులను సంప్రదించాలి. 


ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే కూడా వైద్యులతో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకునేందు యత్నించాలి. 


ఏ చిన్న పని చేస్తున్నా చెమటలు పట్టడం కూడా గుండె సంబంధిత వ్యాధి లక్షణాల్లో ఒకటి. కొందరికి తిన్నప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా చెమటలు పడుతుంటాయి. అలాంటి వారు జాగ్రత్త పడాల్సిందే.  


తరచూ ఛాతీ నొప్పి ఉందని పిల్లలు చెబుతున్నారంటే ఒక్కసారి పరీక్షలు చేయడంలో ఎలాంటి ఇబ్బందిగా ఫీల్ అవ్వొద్దు. 


Also Read: అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతం, గోనె సంచిలో మృతదేహం లభ్యం