Gadwal News : జోగులాంబ గద్వాల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సెల్‌ఫోన్ ఛార్జర్ పదేళ్ల బాలికను బలితీసుకుంది. 10 ఏళ్ల బాలిక నిహారిక స్విచ్ బోర్డ్ ప్లగ్ నుంచి సెల్ ఫోన్ ఛార్జర్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ సరఫరా లైన్లలో సమస్య కారణంగా ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ సమయంలో హై వోల్టేజీ సరఫరా అయిందని అంటున్నారు.
అసలేం జరిగింది?
జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఛార్జింగ్‌లో ఉన్న సెల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. నిహారిక స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. కూతురు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ లో మాట్లాడుతుండగా పేలిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఫోన్ ఓవర్ హీట్ కారణంగా ప్రమాదాలు జరిగాయి. నిత్యం ఉపయోగించే సెల్ కూడా కొన్నిసార్లు తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. సెల్ ఫోన్ వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఇలాంటి ఘటనలు మనకు తెలియజేస్తున్నాయి.
చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి
ఆ తండ్రి విదేశాల నుంచి చాక్లెట్లు తీసుకొచ్చారు. ఎంతో ఆనందంగా తన పిల్లలకు వాటిని ఇచ్చాడు. అయితే అదే చాక్లెట్ తన ముద్దుల కుమారుడిని బలితీసుకుంటుందని ఊహించలేకపోయాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ లో జరిగింది. ఓ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చిన చాక్లెట్ అతని కుమారుడి ప్రాణం తీసింది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో ఇటీవల జరిగింది. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్ బతుకుతెరువు కోసం వరంగల్ వచ్చి డాల్ఫిన్ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ఊపిరాడక
స్థానిక శారద పబ్లిక్ స్కూల్‌లో వారి చిన్నారులు చదువుతున్నారు. ఇటీవల కంగర్‌సింగ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు. వీరిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది బాలుడి తండ్రికి సమాచారం అందించారు. చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్ మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.