వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తండ్రి వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదని, గతంలో సాక్షులు, అప్రూవర్‌గా మారిన వారు కూడా అనుమానాస్పద రీతిలో మరణించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.


జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమార్తె ఈ కేసు విచారణ పట్ల బాగా అసంతృప్తితో ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లుగా జస్టిస్ ఎంఆర్ షా వెల్లడించారు.


ఇంకా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇవీ..


తీర్పులో భాగంగా జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ పట్ల బాధిత కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నందున వారి ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం. ఈ హత్య కేసులో సాక్షాలను నాశనం చేసిన ఆధారాలు ఉన్నాయి. ఒక దురాలోచనతో దాగిన కుట్ర ఈ కేసులో దాగి ఉంది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్షాలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకి రావాలంటే తదుపరి విచారణ కొనసాగాలి. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే పక్క రాష్ట్రంలో విచారణే సరి అని భావిస్తున్నాం. 


గతంలో సీబీఐ కూడా ఈ కేసులో విచారణ కోసం కడపలోని స్థానిక యంత్రాంగం స్పందించడం లేదని అఫిడవిట్ దాఖలు చేసింది. అదికాక, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత కొన్ని అనుమానాలను లేవనెత్తారు. సాక్షులు తనను బెదిరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కూడా ప్రస్తావించారు. కొంత మంది అనుమానాస్పద రీతిలో హత్యకు కూడా గురయ్యారని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు వివేకా హత్య కేసును హైదరాబాద్‌ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది.


గత సెప్టెంబరులో సునీతా రెడ్డి పిటిషన్


మూడేళ్ల కిందట జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో గత సెప్టెంబరులో పిటిషన్ వేశారు. ఏపీలో ఈ కేసు విచారణకు అనుకూల పరిస్థితులు లేవని ఆమె నివేదించారు. సీబీఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ఏమీ సహకరించడంలేదని సునీత పిటిషన్లో సుప్రీంకు వివరించారు. కడపలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని వివరించారు. అందుకే ఈ కేసు తదుపరి విచారణను ఏపీ హైకోర్టు పరిధిలో కాకుండా, తెలంగాణ హైకోర్టు పరిధిలో జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్థించారు.