స్మాల్ స్క్రీన్ మీద స్టార్ ఇమేజ్ ఉన్న కమెడియన్లలో 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) ఒకరు. ఆయన కమెడియన్, యాంకర్, హోస్ట్ మాత్రమే కాదు... హీరో కూడా! సుధీర్ కథానాయకుడిగా నటించిన 'గాలోడు' (Gaalodu Movie) సినిమా నవంబర్ 18న విడుదల అయ్యింది.
విమర్శకుల నుంచి 'గాలోడు చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కొందరు బావుందని అంటే... మరికొందరు కమర్షియల్ పంథాలో తీసారని, కొత్తదనం లేదని చెప్పారు. ప్రేక్షకులు మాత్రం మంచి వసూళ్ళు అందిస్తున్నారు. ముఖ్యంగా బి, సి సెంటర్లలో 'గాలోడు'కు మంచి ఆదరణ లభించింది. అది ఎలా ఉందంటే... గత వారం విడుదల అయిన సినిమాలను తీసేసి మరీ ఈ సినిమాకు థియేటర్లు ఇచ్చేంత!
'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా నవంబర్ 25న విడుదల అయ్యింది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా... 'వన్ నేనొక్కడినే', 'దోచేయ్' ఫేమ్ కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన 'తోడేలు' (భేడియా' తెలుగు డబ్బింగ్) కూడా అదే రోజు విడుదల అయ్యింది. ఆ రెండు సినిమాల కంటే బి, సి సెంటర్లలో 'గాలోడు' చిత్రానికి ఆదరణ బావుందని ట్రేడ్ వర్గాలు సమాచారం. ఆదివారం కొన్ని ఏరియాల్లో ఆ రెండు సినిమాలు తీసేసి, ఆ థియటర్లు 'గాలోడు'కు ఇచ్చారట.
'గాలోడు' నిర్మాతలకు కోటిన్నరకు పైగా లాభం!
'సుడిగాలి' సుధీర్ విషయానికి వస్తే... ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే 'గాలోడు'లో డ్యాన్సులు, ఫైటులు బాగా చేశారనే పేరు వచ్చింది. అతడు గతంలో హీరోగా నటించిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీ మంకీస్' కంటే 'గాలోడు'కు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. పది రోజుల్లో ఈ సినిమా సుమారు 8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎప్పుడో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయ్యింది. నిర్మాతలకు కోటిన్నరకు పైగా లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయనతో సినిమాలు తీయడానికి కొందరు నిర్మాతలు రెడీగా ఉన్నారు.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ భోజన ప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?
'సుడిగాలి' సుధీర్ సరసన గెహ్నా సిప్పి (Gehna Sippy) కథానాయికగా నటించిన 'గాలోడు' చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించింది. సప్తగిరి, పృథ్వీరాజ్, 'షకలక' శంకర్, సత్య కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సి. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు.
'గాలోడు'కు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. సినిమా విడుదల అయిన రోజు సాయంత్రమే మీడియా ముందుకు వచ్చిన టీమ్, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. సినిమా విడుదలకు ముందు 'జబర్దస్త్'లో సుధీర్ స్కిట్స్ చేయడం... ఒక్క రోజు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, స్టార్ యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ తదితరులు రావడం 'గాలోడు'కు హెల్ప్ అయ్యింది. అన్నిటి కంటే ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో సుధీర్ అంటే ఉన్న ఇమేజ్ థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేలా చేశాయి.