తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'వారిసు' (Varisu). తెలుగులో 'వారసుడు' (Varasudu Movie)గా విడుదల చేయనున్నారు. ఇందులోని తొలి పాట 'రంజితమే...' (Ranjithame Telugu Lyrical Video) మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఆల్రెడీ విడుదల అయిన తమిళ వెర్షన్ రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో తెలుగు పాట మీద అంచనాలు నెలకొన్నాయి.
తెలుగులో విజయ్ పాడలేదు!
'రంజితమే...' తమిళ వెర్షన్‌ను హీరో విజయ్ స్వయంగా పాడారు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే... తెలుగులో ఈ పాటను విజయ్ పాడలేదు. అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) ఆలపించారు. 'రంజితమే...' తమిళ వెర్షన్‌లో ఫిమేల్ లిరిక్స్ పాడిన ఎంఎం మానసి, తెలుగులో కూడా పాడారు. రామ జోగయ్య శాస్త్రి తెలుగు పాటకు సాహిత్యం అందించారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ బాణీ అందించిన సంగతి తెలిసిందే.
తెలుగు సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
'రంజితమే...' తెలుగు పాటను నవంబర్ 30న... ఉదయం 09.09 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అంటే... మరో 24 గంటల్లో తెలుగు సాంగ్ సందడి చేయనుంది.
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో విజయ్ జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాటలో ఆమె లుక్ కూడా వైరల్ అయ్యింది. 'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తున్నారు.
వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన 'దిల్' రాజు
సంక్రాంతికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ సమయంలో డబ్బింగ్ సినిమా విడుదల చేయడం ఏమిటి? అని కొందరు విమర్శలు చేశారు. వీటికి 'దిల్' రాజు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ రెండు సినిమాల కంటే ముందే తాము విడుదల తేదీ వెల్లడించమని, ఆ రెండు చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేనితో ఈ విషయమై మాట్లాడానని, తమ మధ్య ఎటువంటి సమస్యలు లేవని 'దిల్' రాజు చెప్పారు. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
Also Read : మళ్ళీ బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా - పూలు, పళ్ళు డిస్కషన్ వస్తే...
తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.