హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాసేపు హల్ చల్ చేశారు. ఉదయం ఆయన నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు. అయితే గేటు వద్దే పోలీసులు నిలిపివేశారు. ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్న వారి జాబితాలో జేసి దివాకర్ రెడ్డి పేరు లేదు. తాను కేసీఆర్‌ను కాదని కేటీఆర్‌ను కలవాలని పోలీసులతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కారు దిగి కాసేపు హల్ చల్ చేశారు. అయితే పోలీసులు మాత్రం కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
Also Read: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? ఏపీ , బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !
జేసీ దివాకర్ రెడ్డి వచ్చినట్లుగా ప్రగతి భవన్ అధికారులుక పోలీసులు సమాచారం ఇచ్చినా .. సరైన స్పందన లేకపోవడంతో లోపలికి పంపలేదు. చివరికి జేసీ దివాకర్ రెడ్డి అక్కడ్నుంచి వెనక్కి వెళ్లిపోయారు. అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లాలని ప్రయత్నించడంతోనే సమస్య ఎదురయిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు తరచూ అసెంబ్లీకి వస్తారు. అక్కడ అన్ని పార్టీల నేతలతోనూ సమావేశం అవుతారు. మీడియాలో హైలెట్ అయ్యేలా వ్యాఖ్యలు చేస్తారు.
Also Read: గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?
గత సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఏమీ బాగోలేవని తెలంగాణలో మాత్రం బాగున్నాయని తాము తెలంగాణకు వస్తామని వ్యాఖ్యానించారు. సరదాగా అన్నారో ..సీరియస్‌గా అన్నారో స్పష్టత లేదు కానీ.. ఇప్పుడు కేటీఆర్‌తో భేటీ కోసం ప్రయత్నించడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.