Minister Harish Rao : కాంగ్రెస్ , బీజేపీ కుర్చీల కోసం కోట్లాటే తప్ప ప్రజాసంక్షేమం కోసం కాదని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.  జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి ఆయన జేపీ నడ్డా కాదు, అబద్ధాలకు అడ్డా అని విమర్శించారు. ఒకరు మోకాళ్ల యాత్ర, ఇంకొకరు పాదయాత్ర, మరొకరు సైకిల్ యాత్ర అంటూ బయలుదేరారన్నారు. బీజేపోళ్లు, కాంగ్రెస్సోళ్లు పాలించే రాష్ట్రాల్లో కనీసం కరెంటు కూడా ఉండడంలేదన్నారు. కళ్యాణ లక్ష్మీ, ఆసరా, రైతుబంధు, రైతుబీమా ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడంలేదన్నారు. 



ఓటుకు నోటు, సీటుకు నోటు 


"నడ్డాకు దమాక్ ఉందా లేదా...రా భూపాలపల్లికి ఎన్ని ఎకరాలకు సాగునీళ్లు అందాయో నిరూపిస్తా. ఆయన జేపీ నడ్డా కాదు అబద్ధాలకు అడ్డా. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మీ కేంద్రమంత్రే చెప్పిండు. కేంద్ర మంత్రులేమో కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడిదంటే నడ్డా ఏమో అవినీతి జరిగింది అంటుండు. ఏడేండ్ల కిందట పాలించింది కాంగ్రెస్ కాదా. కాంగ్రెస్ అంటేనే ఎరువుల కొరత. కాంగ్రెస్ అంటేనే పవర్ కట్లు.  ఎరువుల కోసం, విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడటం మరిచిపోయారా. ఒకపార్టీ నేత ఏమో ఓటుకు నోటు కేసు దొంగ. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్ చేసే పార్టీకి చెందినవారు. కర్ణాటకలో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట. ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారు. అలాంటి పార్టీలు అవి. ఒక పార్టీ ఓటుకు నోటు, మరొక పార్టీ సీటుకు నోటు." అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 


వరంగల్ కాంగ్రెస్ డిక్లరేషన్ పై 


జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హ‌రీశ్‌రావు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ రూ. 55 కోట్ల వ్యయంతో 200 పడకల ఆస్పత్రికి శంకుస్థాప‌న చేశామ‌న్నారు. రూ. 6 కోట్లతో రేడియోల‌జీ, పాథాల‌జీ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు ల్యాబ్‌ల్లో ఉచితంగా 56 పరీక్షలను నిర్వహించ‌నున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. వ‌రంగ‌ల్ లో కాంగ్రెస్ పార్టీ డిక్లరేష‌న్‌పై హ‌రీశ్‌ రావు తీవ్రంగా స్పందించారు. ఏడేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ఎరువుల బ‌స్తాల కోసం లైన్లలో గంటల తరబడి నిల్చున్నది మర్చిపోలేదన్నారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు వారి పాల‌న‌ను గుర్తుచేస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ఆత్మహ‌త్యలు, ఆక‌లి చావులని హ‌రీశ్‌రావు గుర్తుచేశారు.