'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాలతో వెండితెరపై ప్రేమకథలు ఆవిష్కరించడంలో తనది ప్రత్యేక శైలి అని హను రాఘవపూడి చాటి చెప్పారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'... అనేది ఉపశీర్షిక. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ కథానాయకుడు. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. రష్మికా మందన్న కీలక పాత్రలో కనిపించనున్నారు.
'సీతా రామం'లో తొలి పాట 'హే సీతా... ఓ రామ'ను ఈ రోజు విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా... 'ఓ సీతా! వదలనిక తోడవుతా. రోజంతా వెలుగులిడు నీడవుతా. దారై నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా. తీరం తెలిపెనే నుదుటి రాత, నుదుట తిలకమై వాలుతా' అంటూ సాగిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. ఎస్పీబీ చరణ్, రమ్యా బెహ్రా ఆలపించారు. పాట వింటుంటే... ఎస్పీ బాలును ఆయన తనయుడు చరణ్ గుర్తు చేశారు. అంత హృద్యంగా తన గొంతులో మెలోడీని వినిపించారు.
Also Read: ఆడపిల్లను కదా, నన్ను నమ్మవు! - 'గార్గి' ఫస్ట్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన సాయి పల్లవి
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి - ఎక్స్‌ట్రాడినరీ ఫన్‌తో 'ఎఫ్ 3' ట్రైలర్