Minister Harish Rao : డిసెంబర్ 7వ తేదీన సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. జగిత్యాలలో నూతన కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ భవనం, పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. రెండు లక్షల మందితో జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణాకు  ఎనిమిదిన్నర వేల కోట్లు జీఎస్టీ రూపంలో ఇచ్చామని చెప్పారని,  అసలు తెలివి ఉండే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారా అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కిషన్ రెడ్డితో చర్చకు సవాల్ 


"రాష్ట్రం కేంద్రానికి ఇచ్చేది రూ.30 వేల కోట్లు, కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది ఎనిమిది వేల కోట్లు. ఎవరు ఎవరికి నిధులు ఇస్తున్నారో లెక్కలు చెబుతూనే ఉన్నాయి. పన్నులలో వాటా ఇచ్చాం అని అన్నారు. లెక్కలతో సహా మాట్లాడితే నాలుక కరుచుకున్నారు. 42% పన్నుల వాటా ఇస్తున్నామని చెప్పారు కానీ ఇస్తుంది 29.6 శాతమే. ఇస్తున్నామన్న పేరుతో అనేక పథకాలకు నిధుల వాటా తగ్గించారు. కిషన్ రెడ్డితో ఎక్కడైనా సరే చర్చకి నేను సిద్ధం. పన్నుల వాటా పూర్తిగా తగ్గించారు. పైగా అబద్దాలు చెబుతున్నారు. బండి సంజయ్ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తుంది. లక్షా 24 వేల అప్పు ప్రతి పౌరుడిపై ఉంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీకు కనపడుతుందా? లేదా? మీ అబద్దాలు నమ్మడానికి ఇది అమాయక తెలంగాణ కాదు ఉద్యమాల తెలంగాణ" - మంత్రి హరీశ్ రావు 


దాడులతో బెదిరించలేరు 


తెలంగాణలో ED, IT దాడులతో టీఆర్ఎస్ నేతలను బెదిరించలేరని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యమాలు చేసిన గడ్డ తెలంగాణ అని, ఇక్కడ మీ బెదిరింపులకు ఎవరు భయపడరన్నారు. మాకు అధికారం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీ, ఐటీలు ముందు వస్తాయని విమర్శించారు. ఈ దేశంలో ఇదేం కొత్త కాదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ దర్యాప్తు సంస్థల దాడులు జరగడం సాధారణమై పోయిందన్నారు. బీజేపీ విడిచిన బాణాలు ఆ రాష్ట్రాల్లో వాలిపోతాయన్నారు. అంతేకాదు బీజేపీ పెట్టించిన పార్టీలు కూడా ఉంటాయన్నారు. ఉత్తరాధిన అలాంటివి నడిచాయని, కానీ తెలంగాణలో అలా కుదరదని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీకి రాష్ట్రం కాదు, అధికారమే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తెలంగాణ శ్రేయస్సే ముఖ్యం 


"ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మాపై అనేక కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలా ఇబ్బందులు పెట్టినా తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం సాధించాం. ఇవాళ బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా భయపడం. తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడతాం కానీ మీకు తలవంచే తెలంగాణ కాదు. మీకు రాష్ట్రం కాదు అధికారం ముఖ్యం, మాకు తెలంగాణ శ్రేయస్సే ముఖ్యం. దేశంలో 157 మెడికల్ కాలేజీ ఇచ్చారు తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీ పెడతాం. ఇప్పటికే 17 కాలేజీలకు ఉన్నాయి, రాబోయే కాలంలో 16 జిల్లాలో మెడికల్ కాలేజీ పెడతాం. నిన్న మహారాష్ట్రలోని కొన్ని తాలూకల్లోని ప్రజలు మమల్ని తెలంగాణలో కలుపుకోవాలని వేడుకుంటున్నారు." - మంత్రి హరీశ్ రావు