TSRTC Shuttle Services : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ షటిల్‌ బస్‌లు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.  హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీసులు నడపనున్నారు. ఈ సర్వీసుల్లో టికెట్ బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ యాప్ లో బస్‌ ట్రాకింగ్‌ సదుపాయం కూడా ఉంటుందని ఆర్టీసీ తెలిపింది.  


ఐటీ కారిడార్ లో 


 హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో  ప్రత్యేక షటిల్‌ బస్‌లను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి ఆఫీస్‌లకు చేరుకుంటున్నారు. ఈ ప్రత్యేక షటిల్‌ సర్వీసుల్లో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. షటీల్‌ సర్వీస్‌ కోసం ఆన్‌లైన్‌ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాలతో భవిష్యత్‌లో ఐటీ కారిడార్‌లో మరిన్నీ షటీల్‌ సర్వీసులను పెంచనున్నారు. ఈ షటీల్‌ సర్వీస్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు shorturl.at/avCHI  లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ఐటీ ఉద్యోగుల కంపెనీ వివరాలు, లోకేషన్‌, పికప్‌, డ్రాపింగ్‌ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.   






షటిల్ సర్వీసులకు ప్రత్యేక యాప్‌


ఐటీ ఉద్యోగులు సురక్షితంగా తమ గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటిల్‌ బస్‌ సర్వీస్‌ ప్రధాన ఉద్దేశం. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆ యాప్‌లోనే టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ఈ సర్వీస్‌లకు ట్రాకింగ్‌ సదుపాయం కూడా ఉంది.  ప్రస్తుతం బస్‌ ఎక్కడుంది, ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అనే విషయాలను ట్రాకింగ్‌ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. మహిళల భద్రతా కారణంగా షటిల్‌ బస్‌ల్లో ట్రాకింగ్‌ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఆ యాప్‌లో  సర్వీస్‌ నంబర్‌, డ్రైవర్‌, కండక్టర్‌ ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు ఉంటాయని టీఎస్ఆర్టీసీ వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని కోరుతుంది. 


విద్యార్థులకు గుడ్ న్యూస్ 


హైద‌రాబాద్ నగర విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో న‌డిచే అన్ని బ‌స్సుల్లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. అంటే సిటీ బ‌స్సుల‌తోపాటు ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ ట్విట్టర్ ద్వారా ఇటీవల ప్రకటించారు. విద్యార్థుల ర‌ద్దీ దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం ఈ నిర్ణయం తీసుకుంద‌ని, స‌దుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాల‌ని ఆయన కోరారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ఇంజినీరింగ్ కాలేజీలు తమ సొంత వాహన సర్వీసుల కోసం 10 నెలల కాలానికి విద్యార్థుల నుంచి రూ. 30 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తుండగా.. అదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి 10 నెలల కాలానికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం కేవలం 500 బస్సులు మాత్రమే శివారులోని కళాశాలలకు నడుస్తున్నాయి. విద్యార్థుల రద్దీకి ఇవి ఏమాత్రం సరిపోవడంలేదు. తాజాగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు బస్సుల కొరత తీరనుంది.