Mallareddy Case To ED :   తెలంగా మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల నిర్వహణలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. మనీలాండరింగ్ చేశారని.. అక్రమ నగదు బదిలీలు చేశారని ఐటీ శాఖ గుర్తించి ఈడీకి సమాచారం ఇచ్చింది. ఇటీవల మల్లారెడ్డితో పాటు ఆయన సమీప బంధువులు, విద్యా సంస్థలను నిర్వహించే వారి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో లభ్యమైన సమాచారం మొత్తాన్ని ఈడీకి ఐటీ శాఖ పంపింది. మెడికల్ సీట్లు, డొనేషన్ల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించినట్లు ఐటీ శాఖ తెలిపింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరపాలని సిఫారసు చేసింది. ఈడీ విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఐటీ శాఖ అభిప్రాయపడింది. 


రెండు రోజుల పాటు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించిన ఐటీ 


వారం రోజులకిందట  మంత్రి మల్లారెడ్డి ఇంటిలో ఐటీ శాఖ రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించింది.  మల్లారెడ్డికి సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, కుమారులు, బంధువులు, సోదరులు ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు.  రెండు రోజులపాటు 65 బృందాలతో ఐటీశాఖ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహించారు. 400 మంది ఐటీ అధికారులు దాదాపు 48 గంటల పాటు తనిఖీలు చేశారు. సోదాలు ముగిసిన తర్వాత పంచనామా నివేదికలను మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు అందజేశారు.  ఈ తనిఖీల్లో 10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. 


ఐటీ అధికారులతో ఘర్షణ పూరితంగా వ్యవహరించిన మల్లారెడ్డి 


సోదాల సందర్భంగా మల్లారెడ్డి ఐటీ అధికారులతో ఘర్షణ పూరితంగా వ్యవహరించారు. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారని .. తన ఇంట్లో సోదాలు పూర్తి అయిన త‌రువాత తనతో, తన చిన్న కుమారుడితో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.  తన పెద్ద కొడుకుకు సంబంధించి కూడా రిపోర్ట్ తయారు చేశారని, ఆయనతో సంతకం చేయించుకోవడానికి వెళ్తుంటే ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో ఉన్నారని, తన కొడుకు తరపున కూడా తానే సంతకం పెడతానని చెప్ప‌గా అందుకు ఐటీ అధికారులు అంగీక‌రించార‌ని... త‌రువాత‌ త‌న‌ను మోసం చేశారని  నాన్నతో ఐటీ అధికారులు సంతకం చేయించుకుంటున్నారని ఆసుపత్రి నుంచి తన మనవరాలు తనకు ఫోన్ చేసి చెప్పిందన్నారు.  త‌న‌ కొడుకుతో దౌర్జ‌న్యంగా సంత‌కం చేయించుకున్న‌ారని..  ఆ పేప‌ర్ల‌లో ఏముందో కూడా చ‌ద‌వ‌కుండా సంత‌కం పెట్టేశాడ‌ని.. అందులో వంద కోట్ల బ్లాక్ మనీ దొరికిందని రాసుకున్నారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ వివాదం రెండు వర్గాల మధ్య కేసులకు దారి తీసింది. 


ఈడీ కూడా కేసులు నమోదు చేస్తే మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు


సోమవారం నుంచి మల్లారెడ్డి బంధువులను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు సన్నిహితులు...మల్లారెడ్డి ఆడిటర్‌ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ..ఐటీ శాఖ ఈడీ విచారణకుసిఫారసు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేస్తే మల్లారెడ్డికి చిక్కులు మరింత ఎక్కువ కానున్నాయి.