తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారు తమ స్వరాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా సీనియర్లు తమకు పార్టీ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో సమాచారం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒకరయిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన శాసనసభ ప్రాంగణంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆవేశంతో ఊగిపోయారు. పీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడానికి ముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు. కాంగ్రెస్ పార్టీనా.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని విమర్శించారు.
Also Read : ఖమ్మంలో అమానవీయం.. చితిపై కూర్చొని నిరసన, అంత్యక్రియలు వద్దని స్థానికుల డిమాండ్
ఇటీవల టీ పీసీసీ రెండు నెలల పోరాట కార్యాచరణను ప్రకటించింది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండా చర్చ లేకుండా ఎలా ఖరారు చేశారని ఆయన ఫీలయ్యారు. అందుకే పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వర్సెస్ అజహరుద్దీన్ అంటూ క్రికెట్ మ్యాచ్‌ను జహీరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ గురించి గీతారెడ్డికి కనీసం సమాచారం ఇవ్వలేదని.. మండిపడ్డారు. అంతే కాదు.. సంగారెడ్డి జిల్లాలో పర్యటించినా... తనకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నారు. కనీసం ప్రోటో కాల్ పాటించాలి కదా అని ఆయన విమర్శించారు. తనతో వివాదం ఉందని రేవంత్ రెడ్డి చెప్పాలనుకుంటున్నారని అందుకే సమాచారం ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరని ఆయన మండిపడ్డారు.
టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చురుగ్గా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రేవంత్ దూకుడు పార్టీ సీనియర్లకు నచ్చడం లేదు. తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండటం లేదని.. తమకు స్థాయికి తగ్గ గౌరవం దక్కడం లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు కూడా తరచూ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తరచూ చర్చకు వస్తున్నాయి.
అయితే ఇటీవల ఏఐసిసి తెలంగాణకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియమించింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు రెండు నెలల కార్యక్రమాలు రూపొందించారని అందులో రేవంత్ రెడ్డి ఒక్కరి నిర్ణయం ఏమీ లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అది ఎప్పుడూ ఉండేదని సమాచారం అందినా ఏదో ఓ వంకతో అసంతృప్తి వ్యక్తం చేస్తారన్న అభిప్రాయం రేవంత్ వర్గీయుల్లో ఉంది. జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో సీనియర్లకు రేవంత్‌కు మధ్య దూరం పెరుగుతోందని మరోసారి తేల్చినట్లయింది.
Also Read : 8 ఏళ్ల బాలికకి గట్టిగా ముద్దు పెట్టేసిన బాలుడు.. కారణం తెలిసి పోలీసుల దిమ్మతిరిగింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి