తెలంగాణ శాసన సభ సమావేశాలు వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపనతో తెలంగాణ శాసనసభ ప్రారంభమైంది. వెంటనే ఇటీవల మరణించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ ప్రజా ప్రతినిధులకు సభ కొంత సేపు సంతాపం ప్రకటించింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం సభను సోమవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇటీవల మరణించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మేరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. వెంటనే సభ్యులంతా నిలబడి కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించారు.
Also Read: Khammam: ఖమ్మంలో అమానవీయం.. చితిపై కూర్చొని నిరసన, అంత్యక్రియలు వద్దని స్థానికుల డిమాండ్
ముగిసిన సమావేశం.. కాంగ్రెస్ కొత్త డిమాండ్
అనంతరం అసెంబ్లీ భవనంలో స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ప్రారంభమైంది. సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను ఖరారుపై చర్చ జరిపారు. శాసన సభను ఎక్కువ రోజులు జరపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా అదుపులో ఉండటంతో 8 రోజులు సభ నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. మొత్తం 12 అంశాలపై చర్చించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జాబితా అందించారు. అయితే, అన్ని పక్షాల నుంచి జాబితా రావాలని, జాబితా వచ్చాక పనిదినాలు నిర్ణయిద్దామని సభాపతి పోచారం చెప్పారు.
ఈ భేటీలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, చీఫ్ విప్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. దీంతో వారు అసంతృప్తితో వెళ్లిపోయారు.
Also Read: Hyderabad Crime: యువతి మృత దేహం.. నగ్నంగా దుప్పట్లో చుట్టి తరలింపు.. హయత్ నగర్‌లో కలకలం