హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టే నిరుద్యోగ దీక్షకు వెళ్తున్న వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడుకున్నారు. తన నివాసం లోటస్ పాండ్ నుంచి బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులను నెట్టుకొని ఆమె దీక్షకు వెళ్లేందుకు యత్నించారు.
తను అడ్డుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. సొంత పనుల మీద కూడా బయటకు రాకూడదా అని ఫైర్ అయ్యారు. ప్రతి విషయానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ధ్వజమెత్తారు. కారులో ధర్నాచౌక్‌కు వెళ్తున్న ఆమె మొదట పోలీసుల ఆపే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసి డ్రైవర్ కారును మెల్లగా పోనిచ్చాడు. ఎందుకు స్లో చేశావని.. ఆపొద్దు ఫాస్ట్‌గా తొక్కూ అంటూ డ్రైవర్‌కు చెప్పారు షర్మిల. అదే టైంలో ఎదురుగా ఉన్న పోలీసులకు ఏమైనా అవుతుందేమో అని వాళ్లను పక్కకు లాగండని అక్కడే ఉన్న పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు ఆ వెహికల్‌ను ముందుకు పోనివ్వలేదు. అక్కడే ఆపేశారు.
తను అడ్డుకున్న పోలీసులుపై ఫైర్ అయ్యారు షర్మిల. అసలు తనను ఆపే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహహం వ్యక్తం చేశారు. పోలీసులు రిక్వస్ట్ చేస్తున్నా... షర్మిల ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు, ప్రభుత్వం చర్యలకు నిరసగా అక్కడే నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. ఒంటరిగా రోడ్డుపై కూర్చున్న ఆమెను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌కు తరలించిన సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. నిరుద్యోగులకు అన్యాయంచేశారని ఆరోపించారు. ఇచ్చిన నోటిఫికేషన్లకు సరిగా పరీక్షలు కూడా పెట్టలేకపోయారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్పీలో కేసీఆర్ ప్రమేయం లేకుంటే సీబీఐ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే పేపర్ లీకేజీలో సీబీఐ దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు షర్మిల.
గవర్నర్‌కు లేఖ రాసిన షర్మిల
ఈ మధ్యే గవర్నర్ తమిళసైకి లెటర్ రాసిన షర్మిల దేశంలోనే ఒక కమిషన్ లో జరిగిన అతిపెద్ద స్కాం TSPSCలో జరిగిందని, సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మి 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. ఈ పేపర్ లీకుల వెనుక బోర్డ్ చైర్మన్, మెంబర్లు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని ఆరోపించారు. ఆర్టికల్ 317 ప్రకారం TSPSC బోర్డ్ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, కొత్త బోర్డ్ వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
TSPSC పూర్తి విశ్వసనీయత కోల్పోయిందని, ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యం అన్నారు షర్మిల. TSPSC పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఈ కేసులో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారు. పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని షర్మిల ఆరోపించారు.
కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పేపర్లు లీక్ చేశారని, మరెవరి ప్రమేయం లేదని కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు వ్యక్తులే పేపర్ లీక్ చేశారని జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారని, దర్యాప్తు పూర్తికాక ముందే దోషులు ఎవరనేది తేల్చేశారు. తనకేం సంబంధం లేదని చెప్పుకొస్తున్న మంత్రి గారు దోషులను ఎలా నిర్ణయిస్తారు? అని ఆమె ప్రశ్నించారు. దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ తీరుందని సెటైర్లు వేశారు. అంతేకాక కీలకమైన డాటా మంత్రి చేతుల్లోకి వెళ్లింది. పలు వేదికల్లోనూ పరీక్షలు ఎవరెవరు రాశారో చెప్పేస్తున్నారు. ఇతరులకు దొరకని డాటా కేవలం మంత్రికి మాత్రమే ఎలా అందిందని నిరుద్యోగులకు సైతం సందేహాలు నెలకొన్నాయని గవర్నర్ తమిళిసైకి రాసిన లేఖలో పేర్కొన్నారు.