Headlines Today :


మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ మూడో సభ


మహారాష్ట్రంలో ఇవాళ మూడో బహిరంగ సభను నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్‌. శంభాజీనగర్‌లో జరిగే సభకు ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ తన మొదటి సభను నిర్వహించింది. రెండో సభను మార్చి 26న లోహలో ఏర్పాటు చేసింది. వేల మందిని ఈ సభకు తరలించింది బీఆర్‌ఎస్‌. 
ఇప్పటికే చాలా మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. నేటి సభ తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేటి సభ జబిందా ఎస్టేట్స్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని గులాబీమయం చేశారు నేతలు. మీటింగ్ ఏర్పాట్లను జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ సహా ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు. గ్రామగ్రామానికి వెళ్లి తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను వివరించేలా ప్రచారాన్ని నిర్వహించారు. అలాంటి పథకాలు మహారాష్ట్రలో రావాలంటే బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని స్థానికులు ఆ పార్టీలో చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు. 


వివేక హత్య కేసులో సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు 


వివేక హత్య కేసులో ఇవాళ కీలక మలుపు తిరగనుందనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారించనుంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ విచారణకు హైకోర్టు ఆటంకం కలిగించిందని ఆమె పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... గత శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పు దారుణమైనదిగా అభివర్ణించింది. అయితే అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయద్దని కూడా ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు ఇవాల్టికి కేసు విచారణ వాయిదా వేసింది. ఇవాళ కోర్టులో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయి. ప్రతివాదుల వాదన ఎలా ఉంటుందనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. 


ఏడు నగరాల్లో మోదీ టూర్


ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల్లో ఏడు నగరాల్లో పర్యటించనున్నారు. సుమారు 5300 కిలోమీటర్లు 36 గంటల్లోనే చుట్టి రానున్నారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యప్రదేశ్ నుంచి మొదలయ్యే మోదీ పర్యటన రేవా, ఖజరహో, కొచ్చి, తిరువనంతపురం, సిల్వాసా మీదుగా సూరత్‌ చేరుకొని ముగుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని రేవా చేరుకొనున్న ఆయన.. అక్కడ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు తిరువనంతపురం చేరుకొని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్‌ తిరువనంతపురం, కాసరగోడ్‌ మధ్య ట్రావెల్ చేయనుంది. తర్వాత కొచ్చిలో దేశంలోనే తొలివాటర్‌ మెట్రో సర్వీస్ ప్రారంభిస్తారు. 


ఆన్‌లైన్‌లో కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లు


కానిస్టేబుల్ తుది రాత పరీక్ష 30న జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో పెట్టారు. www.tslprb.com వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 3న ఉదయం పది గంటలన నుంచి సాయంత్రం 5.30 వరకు కానిస్టేబుల్ పరీక్షలు జరగనున్నాయి. 


ఖమ్మంలో కాంగ్రెస్ సభ


తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ మరో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఖమ్మం వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకు సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలతోపాటు టెన్త్‌ పరీక్ష లీకేజీలు, ఉద్యోగ నియామకాలు, ఇతర సమస్యలపై వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ సభలు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయాలని ప్లాన్ చేసింది. తొలి సభను ఖమ్మం వేదిగా ఏర్పాటు చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. సభలో రేవంత్ రెడ్డితోపాటు ఇతర సీనియర్‌ లీడర్లు పాల్గొంటారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా 27న గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. 


హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ


ఐపీఎల్‌ 2023లో మరో ఆసక్తికరమైన పోరుకు గ్రౌండ్ రెడీ అయింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీ పడనున్నాయి. వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న హైదరాబాద్‌ జట్టు ఢిల్లీపై విజయం సాధించి మళ్లీ సక్సెస్‌ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. ఆరు మ్యాచ్‌లో ఒకదాంట్లో విజయం సాధించిన ఢిల్లీ అదే టెంపో కొనసాగించాలని ప్లాన్స్ వేస్తోంది.